టీకాలు.. రక్షణ కవచాలు

Awareness On Vaccines In World Immunization Week Programme - Sakshi

ప్రపంచ ఇమ్యునైజేషన్‌ వీక్‌..

ప్రాణాలను కాపాడటంలో వ్యాక్సిన్‌లకు అమిత ప్రాధాన్యత ఉంది. అయినప్పటికీ పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఫ్లూ వ్యాక్సిన్‌ ను తీసుకోవడం భారతదేశంలో చాలా స్వల్పంగా మాత్రమే ఉంది. అంటువ్యాధుల ద్వారా సంభవించే మరణాలలో 25% వరకూ టీకాలు నివారిస్తాయి. ఈ నేపధ్యంలో అంటువ్యాధుల నివారణ కోసం  జీవితమంతా రోగ నిరోధక టీకాలను వేయించడం అవసరం. చాలామంది టీకాలనగానే పిల్లలుకు మాత్రమే అనే  భ్రమలో ఉంటారు.

అయితే పెద్దవారికి కూడా టీకాలు వేయించుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరి. , వ్యాక్సిన్‌ తో నివారించగల వ్యాధుల  వ్యయాన్ని తగ్గించడానికి పెద్దలలో కూడా టీకాలపట్ల సుముఖత పెంచాలి. ఈ ప్రపంచ రోగ నిరోధక వారంలో భాగంగా ఇమ్యునైజేషన్‌ కార్యక్రమం పట్ల ఉన్న అపోహలు తొలగించడంతో పాటు తప్పుడు సమాచారం పట్ల అవగాహన కల్పించాల్సి ఉందని వైద్యులు అంటున్నారు. 

పెద్దలకు మేలు...
ఫ్లూ, న్యుమోనియా లాంటి సంక్రమణ వ్యాధులకు వ్యతిరేకంగా తగిన రీతిలో టీకాలను తీసుకోకపోవడం వల్ల హాస్పిటలైజేషన్‌ , చికిత్స పరంగా అనవసర ఖర్చులు పెరుగుతున్నాయి.  ‘‘భారతదేశంలో 2–3% మంది పెద్దలు కూడా టీకాలు వేయించుకోవడం లేదు. అడల్ట్‌ వ్యాక్సినేషన్‌  ప్రోగ్రామ్‌ పెద్దగా ప్రజలకు చేరువ కావడం లేదు. తగిన టీకా షెడ్యూల్‌ పాటించడం ద్వారా హాస్పిటలైజేషన్‌  అవసరాన్ని తగ్గించుకోవచ్చు. తీవ్ర అనారోగ్య నివారణకు టీకాలు తప్పనిసరి అని ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంది. 

మరోవైపు ప్రపంచ మధుమేహ,  సీఓపీడీ రాజధానిగా ఇండియా వెలుగొందుతోంది. భారతీయులు ఈ రెండు వ్యాధుల బారిన పడేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. హెచ్‌1ఎన్‌ 1 లాంటి వ్యాధులు విపత్తును కలిగిస్తుంటే హెప్‌ బీ ప్రాంణాంతికంగా మారుతుంది. ఈ సమస్యలను వ్యాక్సిన్‌ లతో నివారించవచ్చు’’ అని అపోలో ఆసుపత్రికి చెందిన డాక్టర్‌ విజయ్‌ కుమార్‌ చెన్నంశెట్టి అన్నారు. డిఫ్తీరియా, టెటానస్‌ లాంటి టీకాలను సైతం తీసుకోవడం ద్వారా మరణాలు లేదా అనారోగ్యం నివారించవచ్చు. 

భారతప్రభుత్వంతో పాటుగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ కూడా  చిన్నారులకు టీకాలను వేయించడం ప్రాధాన్యతాంశంగా చూస్తుంటాయి. అంటు వ్యాధుల బారిన పడేందుకు ఎక్కువ అవకాశాలుండటం కూడా దీనికి కారణం.

పిల్లలకు తప్పనిసరి...
‘‘ఐదేళ్ల లోపు పిల్లల్లో అధికశాతం మంది మరణించడానికి న్యుమోకోకల్‌ బ్యాక్టీరియా కారణమవుతుంది  వ్యాధులకు చికిత్సకంటే నివారణ మేలు. చిన్నారులు ఆరోగ్యంగా ఉండటానికి టీకాలు తప్పనిసరి. అయితే వీటి గురించి ముందస్తుగా డాక్టర్లతో చర్చించడం అవసరం  ’’ అని డాక్టర్‌ ఎం సురేంద్రనాథ్, పీడియాట్రిషియన్  అన్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top