క్యాన్సర్‌ కణాలపై విద్యుత్‌ఛార్జ్‌!!

Antitumor effects of electrochemical treatment - Sakshi

అల్లరిమూకలపై లాఠీఛార్జి!! అందరూ ఈ మాట అనేక సార్లు వినే ఉంటారు. దాదాపు క్యాన్సర్‌ కణాలూ అంతే. అయితే ‘లాఠీచార్జీ’కి బదులు... ఈ సరికొత్త చికిత్స ప్రక్రియలో ‘విద్యుత్‌ ఛార్జీ’ ప్రయోగిస్తారు. తలపైనున్న క్యాప్‌ నుంచి ‘ఛా...ర్జ్‌’ అంటూ ఆదేశాలు రాగానే... అపాయకర క్యాన్సర్‌కణాలన్నీ చెల్లాచెదురైపోతాయి. అంతేకాదు... ఆ విద్యుత్‌షాక్‌ కారణంగా వాటి పెరుగుదలా ఆగిపోతుంది. అదెలాగో చూద్దామా?

సాధారణంగా మెదడులో క్యాన్సర్‌ గడ్డలు వస్తే ప్రధానంగా సర్జరీతో తొలగిస్తారు. కానీ మెదడులో శస్త్రచికిత్స కాస్త కష్టమైన ప్రక్రియ. క్యాన్సర్‌ గడ్డ వరకే తొలగించాలి. లేదంటే... దేహంలో అది నియంత్రించే ఏదైనా కేంద్రానికి ఏ కొంత దెబ్బ తగిలినా... ఆ ప్రాంతం చచ్చుబడిపోతుంది.

అయితే ఇటీవల ‘ఆప్ట్యూన్‌ థెరపీ’ అనే సరికొత్త ప్రక్రియకు అమెరికాకు చెందిన ఎఫ్‌డీఏ అనుమతి ఇచ్చింది. టోపీలా ధరించాల్సిన ‘ఆప్ట్యూన్‌ డివైజ్‌’ అనే ఓ పరికరం కొన్ని విద్యుత్‌ క్షేత్రాలను పుట్టిస్తుంది. ఆ క్షేత్రాల్లో ప్రసారమయ్యే విద్యుత్తు... విస్తృతంగా పెరగబోయే క్యాన్సర్‌ కణజాలాన్ని చెల్లాచెదురు చేస్తుంది. ఇటీవలే అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త చికిత్స ప్రక్రియ గురించి అవగాహన కోసమే ఈ కథనం.

మెదడులో వచ్చే గ్లయోబ్లాస్టోమా అనే రకానికి చెందిన క్యాన్సర్‌ గడ్డలకు చికిత్స అందించేందుకు ఉద్దేశించిన పరికరమే ‘ఆప్ట్యూన్‌ డివైజ్‌’. దీన్ని తలకు తొడిగాక అది తలచుట్టూ ‘ట్యూమర్‌ ట్రీటింగ్‌ ఫీల్డ్‌’ అనే విద్యుత్‌ క్షేత్రాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ క్షేత్రం ఫలితంగా కొత్తగా పెరగాల్సిన క్యాన్సర్‌ కణాలు పెరగకుండా పోతాయి. అంతేకాదు... ఆ ప్రాంతంలోని క్యాన్సర్‌ కణాలన్నీ చెల్లాచెదురైపోతాయి. అయితే కొత్త చికిత్స గురించి తెలుసుకోడానికి ముందర అది చికిత్స చేసే ‘గ్లయోబ్లాస్టోమా క్యాన్సర్‌’ గడ్డలు గురించి తెలుసుకుందాం. 

గ్లయోబ్లాస్టోమా అనేవి చాలా వేగంగా పెరిగే ఒక రకం క్యాన్సర్‌ కణుతులు. ఇవి నాడీకణాల ఆధారంగా పెరిగేవి. కాబట్టి అవి సాధారణంగా మెదడులో లేదా కాస్త అరుదుగా వెన్నుపాము మీద వస్తుంటాయి. ఇవి చాలా చురుగ్గా, వేగంగా, తీవ్రంగా పెరుగుతాయి. ఈ తరహా క్యాన్సర్‌ ఎందుకు వస్తుందనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. అయితే అరుదైన కొన్ని రకాల జన్యురుగ్మతలు ఉన్నవారిలో ఈ క్యాన్సర్‌ గడ్డలు రావడం వైద్యనిపుణులు, శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది వేగంగా విస్తరించే క్యాన్సర్‌ కావడంతో... ఒకసారి దీని బారిన పడ్డాక బాధితులు సాధారణ ఆయుఃప్రమాణంతో చాలాకాలం పాటు బతికే అవకాశాలు కాస్తంత తక్కువే.

సాధారణంగా క్యాన్సర్‌లో ఉపయోగించే సంప్రదాయ చికిత్సలైన శస్త్రచికిత్స, రేడియోథెరపీ, కీమో వంటి వాటితోనే ఇప్పటివరకూ దీనికి చికిత్స ఇస్తూ వస్తున్నారు. అయితే... ఈ క్యాన్సర్‌కు ఇప్పుడు ఈ ‘ఆప్ట్యూన్‌’ అనే సరికొత్త పరికరం అందుబాటులోకి రావడం చాలామంది బాధితుల పాలిట ఇదో ఆశారేఖగా మారింది. 
ఇప్పుడిప్పుడే అందుబాటులోకి రావడం వల్ల ఇది చాలా ఎక్కువ ఖరీదైన చికిత్సగానే ఉంది. పైగా అమెరికాలో మినహాయించి చాలా యూరోపియన్‌ దేశాల్లోకీ ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ భారత్‌లోని కొన్ని  పెద్ద పెద్ద క్యాన్సర్‌ సెంటర్లలో ఇప్పుడిప్పుడే ఈ చికిత్స అందుబాటులోకి వస్తోంది.
ఏమిటీ ఆప్ట్యూన్‌ పరికరం...? 
గ్లయోబ్లాస్టోమా కోసం ఉపయోగించే ’ఆప్ట్యూన్‌’ ప్రక్రియలో తలచుట్టూ బ్యాండేజీల్లాగా కనిపించే కొన్ని పరికరాలను అతికిస్తారు. ఇందుకు వీలుగా తొలుత బాధితుల తలవెంట్రుకలు తీయిస్తారు. (గుండు చేస్తారు). ఆ గండుకు వీటిని అంటుకుపోయేలా వీటిని రూపొందించారు. వీటిల్లో ‘ట్రాన్స్‌డ్యూసర్‌  అర్రేస్‌’ అని పిలిచే సిరామిక్‌ డిస్క్‌లు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ బ్యాండేజీలా కనిపించే ఉపకరణాన్ని ‘స్కల్‌ క్యాప్‌’లా తొడుగుతారు.

ఈ అర్రేస్‌ – అంటే ఎన్నో అద్దాల్లాంటి సముదాయం అని అర్థం) అన్నింటినుంచీ  వచ్చే వైర్లన్నీ ఒక పోర్టబుల్‌ బ్యాటరీకి కలిపి ఉంటాయి. ఆ బ్యాటరీని భుజం దగ్గరగానీ లేదా బ్యాక్‌ప్యాక్‌లోగానీ పెడతారు. ఈ బ్యాటరీ 
సహాయంతో తలచుట్టూ ఓ విద్యుత్‌ క్షేత్రాన్ని రూపొందిస్తారు. ఈ క్షేత్రాన్ని ‘ట్యూమర్‌ ట్రీటింగ్‌ ఫీల్డ్‌’ అంటారు.
‘టీటీఎఫ్‌’ అంటే...?
‘ట్యూమర్‌ ట్రీటింగ్‌ ఫీల్డ్‌’లో చాలా తక్కువ తీవ్రతతో ఉన్న విద్యుత్‌ తరంగాలు ఉత్పన్నమవుతుంటాయి. ఈ తరంగాలు హానికారక క్యాన్సర్‌ కణాలను ఎటుపడితే అటు చెల్లాచెదురుగా చెదరగొట్టడంతో పాటు... వాటిల్లో కణవిభజన జరగకుండా నిరోధిస్తాయి. ఏ ఫ్రీక్వెన్సీలో ఈ విద్యుత్తరంగాలను ప్రయోగిస్తే... గ్లయోబ్లాస్టోమా కణాలన్నీ చెదిరిపోతాయో... ఆ ఫ్రీక్వెన్సీలో విద్యుత్తరంగాలు ఉత్పన్నమయ్యేలా ఆప్ట్యూన్‌ పరికరాన్ని సెట్‌ చేస్తారు.
ఎంతకాలం పాటు...?  
చికిత్సలో భాగంగా ఇలా ఎంతకాలంపాటు ఈ టోపీలాంటి ఉపకరణాన్ని తొడిగి ఉండాలన్నది ట్యూమర్ల తీవ్రత ఆధారంగా డాక్టర్లు నిర్ణయిస్తారు. దుస్తులన్నింటిలాగే క్యాప్‌ ధరించడమూ ఒకరకంగా ఓ తొడుగు లాంటిదే కాబట్టి ఇది రోజువారీ పనులకూ అడ్డురాదు. ఒక్కోసారి ఈ క్యాప్‌లాంటి తొడుగును రోజుల్లో 18 గంటల పాటు కూడా ధరించాల్సి రావచ్చు. అలాగే తలలోని గడ్డలకు ఈ విద్యుత్‌ తరంగాల ప్రభావం ఉండటానికి, క్యాప్‌ను గుండుతో సరిగా అంటుకుపోయేలా ఉంచడానికి వారంలో రెండుసార్లు వెంట్రులకను తీసేయాల్సి వస్తుంటుంది.
ఎందుకు అందుబాటులోకి రావాల్సి వచ్చింది?
ఈ పరికరం ఎందుకు అందుబాటులోకి రావాల్సి వచ్చిందో కూడా చూద్దాం. యూరోపియన్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రీట్‌మెంట్‌ ఫర్‌ క్యాన్సర్‌ (ఈవోఆర్‌టీసీ) అనే అంతర్జాతీయ పరిశోధన సంస్థ... ‘గ్లయోబ్లాస్టోమా’ బాధితులు వివిధ చికిత్సలతో ఎంత కాలం పాటు మనుగడ సాగించగలరనే అంశాలపై విస్తృతంగా పరిశోధనలు చేసింది. ఏడు అంశాల ఆధారంగా  ఇందుకోసం మూడు మోడల్స్‌ను కూడా రూపొందించిది. ఆ ఏడు అంశాలేమిటంటే... బాధితులకు ఇస్తున్న చికిత్స, అతడి వయసు, శస్త్రచికిత్స ఏ మేరకు సాధ్యమైందనే అంశం, మినీ మెంటల్‌ స్కోర్‌ ఎగ్జామినేషన్‌ అనే పరీక్ష, కార్టికోస్టెరాయిడ్స్‌ ఏమైనా ఇస్తున్నారా అనే అంశం, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశాలకు అనుగుణంగా బాధితుడి సామర్థ్యాలు, ఎంజీఎమ్‌టీ ప్రమోటర్‌ మిథైలేషన్‌ స్టేటస్‌... అనే ఈ ఏడు అంశాల సహాయంతో ఆయా అంశాలను మూడు రకాల మోడల్స్‌ (సూత్రాల్లాంటివి)లో ప్రతిక్షేపించి లెక్కగడతారు.

ఇలా లెక్కగట్టినప్పుడు అననుకూలతలు ఎక్కువగా ఉన్న కొందరు బాధితులు బతికే కాలం చాలా తక్కువగా ఉండటాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. ఇలాంటి వారి ఆయుష్షునూ పెంచడానికి అనేక మార్గాల్లో పరిష్కారాలను వెతుకుతున్నప్పుడు ఈ ఆప్ట్యూన్‌ పరికరం అందుబాటులోకి వచ్చింది. దాదాపుగా పదకొండు నెలలు కూడా బతకరని నిర్ణయించిన చాలామంది రోగుల ఆయుష్షును దాదాపు మూడు నుంచి ఐదేళ్లకు మించి బతికేలా చేసింది ఈ చికిత్స. దీన్ని ఇంకా మెరుగుపరిస్తే... బాధితులు మరింతకాలం బతికే అవకాశం ఉన్నందున అననుకూలురైన చాలామందికి ఇదో ఆశాకిరణంగా కనిపిస్తోంది. 

ఒకసారి గ్లయోబ్లాస్టోమా నిర్ధారణ అయ్యాక... సంప్రదాయ క్యాన్సర్‌ చికిత్సలతో రోగి బతికే అవకాశాలను (ప్రోగ్నోసిస్‌ను) దాదాపుగా మూడేళ్లుగా చెబుతుంటారు. కానీ ఈ ఉపకరణంతో నిర్వహించిన ట్రయల్స్‌లో తర్వాత ఆ రోగుల ఆయుష్షు దాదాపు ఐదేళ్ల వరకు పెరగడాన్ని వైద్యనిపుణులు చూశారు. ఈ పరిశీలనలన్నింటినీ చూశాకే... కొత్త మందులకూ, కొత్త చికిత్స ప్రక్రియలకు అనుమతులిచ్చే ‘ఎఫ్‌డీఏ’ దీన్ని ఆమోదించింది.

సాధారణంగా ఇది నోటిలోకి తీసుకునే మందు కానందున సైడ్‌ఎఫెక్ట్స్‌ పెద్దగా లేవుగానీ... బాధితుల్లో మరికొన్ని రకాల ఇబ్బందులను నిపుణులు గమనించారు. రోజూ మాడుకు క్యాప్‌లా ధరించి ఉండాల్సి రావడంతో మాడు–చర్మం మీద ఇబ్బందిగా (ఇరిటేషన్‌లా) అనిపించడం, మరికొందరిలో తలనొప్పి కనిపించాయి. కీమోథెరపీ తీసుకుంటూనే దీన్ని ధరించివారిలో ప్లేట్‌లెట్‌ కౌంట్‌ తగ్గడం, వికారం, వాంతులు, మలబద్ధకం, అలసట వంటి స్వల్ప అనర్థాలను వైద్యనిపుణులు చూశారు. దీనికి తోడు కాస్తంత అరుదుగా కొందరిలో కాస్త పెద్దస్థాయి అనర్థాలైన మూర్ఛ (ఫిట్స్‌/సీజర్స్‌), డిప్రెషన్‌ వంటి మానసిక సమస్యలనూ గమనించారు. ఇక రోజూ దీన్ని ధరించాల్సి రావడంతో తలపైన చర్మంలో కొన్నిచోట్ల కాస్తంత బిగుతుగా/బిగుసుకుపోయినట్లుగా అనిపించడం (ట్విచ్చింగ్‌), తలమీద పుండ్లు, జ్వరం వచ్చినప్పుడు కనిపించే నీరసం  వంటివి కూడా కనిపించాయి. 
చదవండి: Tomato Fever: ఒళ్లంతా దురద.. జ్వరం, అలసట.. టొమాటో ఫీవర్‌ అంటే? 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top