ఎండ తగిలితేనే కదా ఐస్ ముక్క కరుగుతుంది! కానీ అంటార్కిటికా ఖండంలోని మంచు పలకలు వాటి అడుగు భాగం నుంచి కూడా కరుగుతున్నాయట! అదీ త్వరత్వరగా!! అలా కరిగిన నీరు సముద్ర మట్టాలను పెంచితే, వాతావరణ సమస్థితి దెబ్బతిని, భూప్రపంచం అల్లకల్లోలం కావచ్చునని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఫ్రాన్సులోని యూనివర్సిటీ ఆఫ్ బోర్డియక్స్ శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. సముద్ర ప్రవాహాలలో తీవ్రమైన మార్పులు రావటమే
ఈ ‘అసాధారణ’ స్థితికి కారణం.
పైన భూతాపం... కింద ఉష్ణ ప్రతాపం
‘అంటార్కిటికా’ అనేది భూమికి చిట్టచివరన, దక్షిణ ధ్రువం దగ్గర ఉన్న ఒక భారీ మంచు ఖండం. అక్కడ దాదాపు 98 శాతం మంచు ఉంటుంది. మిగతా 2 శాతంలో పర్వత శిఖరాలు, పొడి లోయలు, తీర ప్రాంతాలు, ద్వీపాలు, ఆ ద్వీపాల్లో పెంగ్విన్‌లు ఉంటాయి. శాస్త్రవేత్తలు తప్ప సాధారణ మనుషులు ఉండరు. ఇక ఆ 98 శాతం మంచుపొర సగటున 1.9 కిలోమీటర్ల మందంలో ఉంటుంది! భూతాపం వల్ల కొన్నేళ్లుగా ఈ మంచు కరుగుతూ వస్తోందనీ, ఒకవేళ అంటార్కిటికాలోని మంచు మొత్తం కరిగిపోతే, సప్త సముద్రాల నీటి మట్టాలు దాదాపు 200 అడుగుల వరకు పెరిగి తీర ప్రాంత నగరాలన్నీ మునిగిపోతాయనీ మనం ఎప్పటి నుండో వింటున్న సంగతే. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు కొత్తగా కనిపెట్టింది ఏమిటంటే, పైనుంచి భూతాపం వల్లనే కాదు, అడుగు నుంచి వేడెక్కుతున్న నీటి ప్రవాహాల వల్ల కూడా అంటార్కిటికా కరుగుతోందని! అంటే, భూమికి మరింత త్వరగా ప్రమాదం ముంచుకు రాబోతోందని!
అడుగున ఎలా వేడెక్కుతున్నాయి?!
అంటార్కిటికా మంచు పలకల అడుగున సర్కమ్‌పోలార్ డీప్ వాటర్ (సి.డి.డబ్లు్య.) అని పిలిచే వేడి నీటి ప్రవాహాలను శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా గమనిస్తున్నారు. ఈ వేడి నీరు సముద్ర ఉపరితలం నుండి సుమారు 500 మీటర్ల (1,600 అడుగులు) దిగువకు, మంచు పలకలకు దూరంగా ఉంటుంది. అయితే మారుతున్న గాలి దిశలు, అంటార్కిటికాను చుట్టి ఉన్న ‘దక్షిణ మహాసముద్రం’లో వీస్తున్న బలమైన గాలుల వల్ల, ఈ లోతైన వేడి నీరు నెమ్మదిగా సముద్ర ఉపరితలం పైకి, మంచు పలకల వైపు కదులుతూ వస్తోంది.
ఈ వేడి నీటి ఉష్ణోగ్రత కేవలం 2 సెల్సియస్ డిగ్రీలు (35.6 ఫారెన్‌హీట్ డిగ్రీలు) మాత్రమే అయినప్పటికీ, అతి శీతలంగా ఉండే అంటార్కిటికా మంచును బలహీనపరచడానికి అది చాలు! ‘‘గతంలో ఈ మంచు పలకల చుట్టూ చల్లటి నీరు ఉండేది, అది వాటిని కరగకుండా కాపాడేది. కానీ ఇప్పుడు సముద్ర ప్రవాహాల్లో మార్పు రావడం వల్ల, ఎవరో వేడి నీటి ట్యాప్ తిప్పినట్లుగా అక్కడి నీరు వేడెక్కుతోంది’’ అని ప్రొఫెసర్ సారా పుర్కీ అంటున్నారు.
చల్లటి ఉప్పు నీరు – వేడి తీపి నీరు!
ధ్రువ ప్రాంతాల దగ్గర మంచు గడ్డకట్టినప్పుడు, మిగిలిన నీరు అత్యంత చల్లగా, ఉప్పగా, సాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఈ నీరు బరువుగా ఉండి సముద్రం అడుగు భాగంలోకి చేరుతుంది. ఇలా నీరు కిందకు వెళ్లేటప్పుడు, తనతో పాటు ఉష్ణాన్ని, కార్బన్‌ను, పోషకాలను లోపలికి తీసుకెళ్తుంది. అలా వెళ్లటం అనేది ప్రపంచవ్యాప్తంగా సముద్రపు నీటిని ఒక క్రమ పద్ధతిలో, ఒక బెల్ట్ లాగా కదిలిస్తుంది.
దానినే ‘ఓషన్ కన్వేయర్ బెల్ట్’ అంటారు. అయితే ఇప్పుడు అడుగు నుంచీ కరుగుతూ ఉన్న మంచు పలకలు తీపి వేడి నీరుగా (ఉప్పు లేని నీరుగా) సముద్రంలో కలిసినప్పుడు ఆ నీరు అంత త్వరగా కిందకు మునగదు. దీనివల్ల సముద్ర ప్రవాహాల వేగం మందగించి, సముద్రాల్లోని జీవజాలానికి అందే పోషకాలు కూడా తగ్గిపోయే ప్రమాదం ఏర్పడుతుంది.
ప్రవాహాలకు అడ్డుగా ‘తీపి’ నీరు
కొత్త డేటా ప్రకారం, అంటార్కిటికా దిగువకు వెళ్లే (మునిగిపోయే) చల్లటి, ఉప్పటి నీటి శాతం తగ్గుతోంది. దానిని భర్తీ చెయ్యటానికి బయట నుండి మరింత వేడి నీరు (ఉప్పు లేని నీరు) మంచు పలకల వైపుకు వస్తోంది. ఆ క్రమంలో మంచును ఇంకా వేగంగా కరిగిస్తోంది. ఇందువల్ల సముద్రాల నీటి మట్టం పెరగడమే కాకుండా మరికొన్ని సమస్యలు కూడా వస్తాయి. సాధారణంగా సముద్రాలు వాతావరణంలోని అధిక వేడిని, కార్బన్‌ను సంగ్రహిస్తాయి. ప్రవాహాలు ఆగిపోతే, సముద్రం ఈ పనిని సరిగ్గా చేయలేదు. దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ మరింత వేగంగా పెరుగుతుంది. తాజా అధ్యయనానికి నాయకత్వం వహించిన డాక్టర్ జోషువా లాన్హామ్ చెప్పినట్లుగా, ఇవన్నీ కేవలం అంచనాలు మాత్రమే కాదు, ఇప్పుడు మన కళ్లముందు నిజంగా జరుగుతున్న మార్పులు!
అడుగు నుంచైనా, పై నుంచైనా..
... అంటార్కిటికా కరగడం అనేది కేవలం ఒక ప్రాంతీయ సమస్య కాదు, ఇది భూతాప భీకర రూపానికి ఒక సంకేతం. సముద్ర ప్రవాహాల వ్యవస్థ బలహీనపడితే, అది వాతావరణాన్ని అతలాకుతలం చేసి, రాబోయే తరాలకు మంచు యుగం వంటి కఠిన పరిస్థితులను కల్పించవచ్చు. ప్రకృతి మనకు ఇస్తున్న ఈ సంకేతాలను గమనించి, పర్యావరణ పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవడం అవసరం.
బరువు తగ్గుతున్న మంచు పలకలు
భూమి పై నుండి సముద్రం వైపు విస్తరించి, నీటిపై తేలుతూ ఉండే మంచు నదులనే మంచు పలకలు (గ్లేషియర్‌లు) అంటారు. అవి అంటార్కిటికా తీర ప్రాంతంలో దాదాపు 75 శాతం మేర విస్తరించి ఉన్నాయి. వీటి మందం 50 నుండి 600 మీటర్ల వరకు ఉంటుంది. వెనుక ఉన్న గ్లేసియర్ల నుండి మంచు ముందుకు నెట్టుకుని రావటం వల్ల, పైన కురిసే మంచు గట్టిపడటం వల్ల ఈ పలకలు పెరిగి, అంటార్కిటికాకు ఒక అడ్డుగోడలా లేదా ‘బ్రేక్’ లా పనిచేస్తాయి.
దీనినే ‘బట్రెసింగ్’ అంటారు. భూమి మీద ఉన్న భారీ గ్లేషియర్లు వేగంగా సముద్రంలోకి జారిపోకుండా ఈ మంచు పలకలు అడ్డుకుంటాయి. ఒకవేళ ఈ పలకలు విచ్ఛిన్నమైతే, వెనుక ఉన్న గ్లేషియర్లు వేగంగా సముద్రంలోకి పడిపోతాయి, దీనివల్ల సముద్ర మట్టాలు ఒక్కసారిగా పెరుగుతాయి. గత 25 ఏళ్లలో 48 మంచు పలకలు వాటి బరువులో 30 శాతాన్ని కోల్పోయాయి. అంటే, అంటార్కిటికాను కాపాడుతున్న ‘అడ్డుగోడలు’ బలహీనపడుతున్నాయని అర్థం. ఇది ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంత నగరాలకు పెద్ద హెచ్చరిక.
ఐరోపాకు అట్లాంటిక్ ‘బెల్టు’ దెబ్బ
ఈ శతాబ్దం పూర్తయ్యేసరికి ఎ.ఎం.ఓ.సి. (అట్లాంటిక్ మెరీడియనల్ ఓవర్‌టర్నింగ్ సర్క్యులేషన్) ప్రవాహం 50 శాతం వరకు దెబ్బతినే అవకాశం ఉందని యూనివర్సిటీ ఆఫ్ బోర్డియక్స్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గత అంచనాల్లో ఇది కేవలం 32 శాతంగా మాత్రమే ఉండేది. ఎ.ఎం.ఓ.సి. అంటే అట్లాంటిక్ మహా సముద్రంలో నిరంతరం ప్రవహించే ఒక భారీ నీటి కన్వేయర్ బెల్ట్ వంటిది. అంటార్కిటికా ఖండానికి సరిహద్దుగా ఉన్న మూడు ప్రధాన సముద్రాలలో అట్లాంటిక్ మహా సముద్రం ఒకటి.
మిగతా రెండూ.. పసిఫిక్ మహా సముద్రం, హిందూ మహా సముద్రం. ఈ మూడు భారీ జల రాశులు దక్షిణ దిశగా ప్రవహించి, దక్షిణ మహా సముద్రంలో విలీనం అవుతాయి. ఒకవేళ ఎ.ఎం.ఓ.సి. పూర్తిగా ఆగిపోతే, అట్లాంటిక్ మహా సముద్రంలో ప్రవహించే ‘గల్ఫ్ స్ట్రీమ్’ ప్రయాణించే దిశ పూర్తిగా మారిపోతుంది. దాని వల్ల ఉత్తర ఐరోపా, బ్రిటన్ తీవ్రమైన చలి కాలంలోకి వెళ్లిపోతాయి. ఇది ఒక రకంగా కొత్త ‘మంచు యుగం’లా ఉంటుంది. అంటే ఐరోపాకు ప్రాణాంతకమైన మంచు యుగం వచ్చేస్తుంది.
మంద గమనం పెరిగింది!
1950 నుండి గ్లోబల్ వార్మింగ్ పెరగడం వల్ల అట్లాంటిక్ మెరిడియనల్ ఓవర్‌టర్నింగ్ సర్క్యులేషన్ (ఎ.ఎం.ఓ.సి.) వ్యవస్థ కదలిక మునుపటి కంటే చాలా వేగంగా బలహీనపడుతోందని పరిశోధకులు గుర్తించారు. గ్రౌండింగ్ లైన్: ఒక గ్లేషియర్ (మంచు పలక) సముద్ర అడుగుభాగంలోని రాతిని తాకే ప్రదేశాన్ని ‘గ్రౌండింగ్ లైన్’ అంటారు. వేడి నీరు ఈ పాయింట్‌ను వెనక్కి నెట్టివేస్తుంది. గ్రౌండింగ్ లైన్ వెనక్కి వెళ్లే కొద్దీ, అంతవరకు రక్షణగా ఉన్న మంచు అడుగు భాగం కూడా వేడినీటిలో మునిగిపోయి కరగడం మొదలవుతుంది. పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ లూప్: ఇది ఒక విషవలయం లాంటిది. మంచు కరిగే కొద్దీ, ఆ మేర మరింత వేడి నీరు లోపలికి చేరుతుంది, ఆ వేడి నీరు మంచును ఇంకా వేగంగా కరిగిస్తుంది. ఇలా ఒకదాని వల్ల మరొకటి ప్రభావితమై మంచు కరగడం అనేది ఊహించనంత వేగంగా మారుతుంది. దీనినే ‘పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ లూప్’ అంటారు.
నీటి వేడిని ఎలా కనిపెడతారు?
అంటార్కిటికా ఖండం అడుగున నీటి ప్రవాహాల ఉష్ణోగ్రతల్ని కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు ‘ఆర్గో ఫ్లోట్స్’ అనే పరికరాలను ప్రయోగిస్తారు. ఇవి సముద్రంలో తేలుతూ, నిరంతరం నీటి ఉష్ణోగ్రత, ఇతర వివరాలను సేకరిస్తుంటాయి. తాజాగా శాస్త్రవేత్తలు ఓడల ద్వారా సేకరించిన పాత డేటాను, ఈ కొత్త ఆర్గో ఫ్లోట్స్ డేటాతో కలిపి గత 40 ఏళ్ల రికార్డును విశ్లేషించారు. దాంతో లోతులో ఉన్న నీటి వేడికి అంటార్కిటికా పైకి చొచ్చుకు వస్తోందని మొదటిసారి నిరూపణ అయింది.


