
వెయిట్ లాస్ జర్నీలకు సంబంధించిన ఎన్నో స్ఫూర్తిదాయకమైన కథలను విన్నాం. ఎన్నో త్యాగాలు, కఠినమైన డైట్‌లు అవలంబించామనే చెబుతుంటారు చాలామంది. ముఖ్యంగా ఇన్ని గంటలు వర్కౌట్లు, డైట్ వంటివి క్రమంతప్పకుండా చేస్తేనే మంచి ఫలితం అని విన్నాం. కానీ ఈ బామ్మ యోగాతో అద్భుతం సృష్టించింది. ఏకంగా ఒక్క ఏడాదికే కిలోలుకొద్ది బరువు తగ్గి యోగా పవర్ ఏంటో చాటిచెప్పి.. అందరికి స్ఫూర్తిగా నిలిచింది.
ఆ బామ్మనే అమృత్సర్‌కు చెందిన 87 ఏళ్ల శకుంతల దేవి. ఆమె యోగాతో ఒక ఏడాదిలోనే 83 కిలోలు పైనే బరువు తగ్గింది. వయస్సుని ధిక్కరించేలా అత్యంత చురుకుగా ఉందామె. వృద్ధురాలిలా కాకుండా ఒక వండర్ బామ్మని చూసిన అనుభూతిని కలిగిస్తోంది. బాలీవుడ్ బుల్లితెర షో లాఫ్టర్ చెఫ్స్ 2లో కనిపించి..అందరినీ ఆశ్చర్యపరించిందామె.
ఆమె అసామాన్య ఎనర్జీని చూసి అక్కడ సెలబ్రిటీలే విస్తుపోయారు. ఆ షో హోస్ట్ భారతి సింగ్‌తో మాట్లాడుతూ తాను ఒకప్పుడు దగ్గర దగ్గర.. 123 కిలోలు పైనే బరువు ఉండేదాన్ని అని చెప్పింది. దాంతో ఒక్కసారిగా అక్కడున్నవారంతా విస్తుపోయారు.
తాను యోగా మీద నమ్మకంతో వెయిట్‌లాస్ జర్నీని ప్రారంభించానని చెప్పుకొచ్చింది. "బరువు తగ్గడం అనేది ఒక స్థిరమైన ప్రయాణం. కేవలం క్రమశిక్షణతో కూడిన స్థిరత్వంతో శరీరం బరువు తగ్గించేలా మనసుని ప్రేరేపించగలం అని చెబుతోంది". ఆ షోలో శకుంతలా దేవి వేసిన యోగాసనాలను చూసి అంత షాకయ్యారు. ప్రతి ఒక్క ఆసనాన్నిచాలా అలవోకగా వేసిందామె.
123 కిలోల నుండి 40 కిలోలకు ఎలా చేరుకుందంటే..
2008 ఆ సమయంలో శకుంతల దేవి విపరీతమైన బరువు పెరిగి ఇబ్బందిపడింది. దాంతో ఆమె దైనందిన జీవితం భారంగా మారింది చిన్న చితక పనులు కూడా చేయలేని పరిస్థితికి వచ్చేసింది. భారతీయ గురువు బాబా రాందేవ్ ఆమెను యోగాకు పరిచయం చేసినప్పుడు తన పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెబుతోందామె. టెలివిజన్‌లో ఆయన యోగాసనాలు ప్రదర్శించడం చూసి తన వెల్‌నెస్ నియమావళిలో ఆరోగ్యకరమైన అలవాట్లను చేర్చుకోవాలని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యిందట.
ఆమె చికిత్స కోసం మందులను ఆశ్రయించకూడదని ఇంట్లోనే సాధారణ ఆసనాలను అభ్యసించడం ప్రారంభించింది. ఒక ఏడాది తర్వాత 2009లో శకుంతలా దేవి యోగాను సరిగా నేర్చుకోవడానికి హరిద్వార్‌కు వెళ్లింది. రోజువారి దినచర్యలో భాగంగా 4 గంటలకు మేల్కొని ఆసనాలు వేయడం చేసేది. దాంతో కేవలం ఒక్క ఏడాదిలోనే బరువు తగ్గడమే కాకుండా యోగా ఆమె ఆరోగ్యాన్ని పూర్తిగా మార్చివేసింది.
ఇది ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ఇప్పటికీ ఈ వయసులో కూడా ఆమె కఠినమైన ఫిట్‌నెస్ నియమాన్ని అనుసరిస్తుంది. అలాగే ఇతరులకు యోగాని నేర్పుతోంది. దృఢ సంకల్పం, నిబద్ధతలతో మెరుగైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోగలమని శకుంతల దేవి వెయిట్ లాస్‌స్టోరీనే చెబుతోంది. కాగా, హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ ప్రకారం, యోగా కేలరీలను బర్న్ చేయడమేగాక, అతిగా తినడాన్ని నివారించి బరువు తగ్గేలా చేస్తుందని జర్నల్‌లో పేర్కొంది.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: రక్తపరీక్షతో ప్రీఎక్లాంప్సియా గుర్తింపు!)