
చాలామంది గర్భిణులు ప్రీఎక్లాంప్సియా సమస్యకు లోనవుతుంటారు. ఇప్పటి వరకు ఈ సమస్య వచ్చాక గుర్తించి, చికిత్స చేసే పద్ధతులే ఉన్నాయి తప్ప ముందుగా గుర్తించే పద్ధతులేవీ అందుబాటులో లేవు. అయితే, ఇటీవల స్పానిష్ వైద్య నిపుణులు ప్రీఎక్లాంప్సియాను నెలల ముందుగానే గుర్తించగల రక్తపరీక్ష విధానాన్ని కనుగొన్నారు.
ప్రీఎక్లాంప్సియా సాధారణంగా గర్భిణుల్లో మొదటి ఇరవై వారాల తర్వాత తలెత్తుతుంది. దీనివల్ల రక్తపోటు పెరగడం; మూత్రంలో ప్రొటీన్ పోవడం; శరీరంలో నీరు నిలిచిపోవడం వల్ల బరువు పెరగడం; ముఖంలోను, చేతుల్లోను వాపులు రావడం; వాంతులు, వికారం పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
‘ప్లాస్మా సెల్ ఫ్రీ ఆర్‌న్‌ఏ’ (సీఎఫ్‌ఆర్‌ఎన్‌ఏ) రక్తపరీక్ష ద్వారా ప్రీఎక్లాంప్సియా వచ్చే అవకాశాలను నెలల ముందుగానే గుర్తించవచ్చు. ఈ పరీక్షను స్పానిష్ వైద్య పరిశోధన సంస్థ ‘ఐప్రీమామ్’కు చెందిన టమారా గారిడో గోమెజ్ నేతృత్వంలోని వైద్య నిపుణులు రూపొందించారు. వీరు 2021–2024 మధ్య 9,586 మంది మహిళలకు ఈ రక్తపరీక్షలు నిర్వహించి, విజయవంతమైన ఫలితాలను సాధించారు.
డాక్టర్ ప్రమత శిరీష, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
(చదవండి: ఏడాది తర్వాత రక్తస్రావం అవుతుంది..ఇది పెద్ద సమస్యనా?)