● కూటమి నేతల ఫ్లెక్సీల తొలగింపులో అధికారుల నిర్లక్ష్యం
● కోడ్ అమల్లో ఉన్నా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
భీమవరం : జిల్లాలో ఎన్నికల కోడ్ అమలుకావడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార కూటమి నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో, డిసెంబర్ 2 వరకు కోడ్ అమల్లో ఉంటుందని ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు. అయినప్పటికీ, జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు, బ్యానర్లు, దివంగత నేతల విగ్రహాలు స్పష్టంగా కనిపిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లా కేంద్రమైన భీమవరంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ తోట సీతారామలక్ష్మి తదితరుల ఫ్లెక్సీలను విచ్చలవిడిగా ఏర్పాటు చేసినా మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. గతంలో వైఎస్సార్సీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను రెండు రోజుల్లోనే తొలగించిన అధికారులు, కూటమి నాయకులు ఏర్పాటు చేసినవాటిని నెలల తరబడి వదిలేయడం వారి పక్షపాత వైఖరికి నిదర్శనమని స్థానికులు మండిపడుతున్నారు. కోడ్ అమల్లోకి వచ్చి మూడు రోజులు గడిచినా నేటికీ వీటిని తొలగించకపోవడం వెనుక ఉద్యోగుల స్వామిభక్తి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్క భీమవరం పట్టణంలోనే కాకుండా ఉండి, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు నియోజకవర్గాల్లో సైతం అనేక చోట్ల ఫ్లెక్సీలు, బ్యానర్లు దర్శనమిస్తున్నా మున్సిపల్, పంచాయతీ అధికారులు కన్నెత్తి చూడటం లేదు. గతంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే ఫ్లెక్సీలను తొలగించడంతో పాటు దివంగత నేతల విగ్రహాలకు ముసుగులు వేసేవారు. కానీ, ప్రస్తుతం విగ్రహాల జోలికి కూడా వెళ్లకపోవడం గమనార్హం.
నియమావళికి విరుద్ధంగా చెక్కుల పంపిణీ
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయకూడదు. అలాగే సంక్షేమ పథకాల ప్రచారం, చెక్కుల పంపిణీ వంటివి పూర్తిగా నిలిపివేయాలి. అయితే ఈ నిబంధనలకు విరుద్ధంగా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) ఈ నెల 15న తన క్యాంపు కార్యాలయంలో 125 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎమ్ఆర్ఎఫ్) చెక్కులను పంపిణీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


