ద్వారకాతిరుమల: మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలు, రంగురంగుల కాంతులతో మెరిసే గోపురాలు, స్వామి అమ్మవార్ల దివ్యరూపాలు, దశావతారాల విద్యుత్ చిత్రాలతో చిన్నతిరుపతి దివ్యక్షేత్రం విద్యుత్ కాంతుల హరివిల్లును తలపిస్తోంది. ఆలయ ప్రాంగణం మొదలుకొని కొండ పరిసరాల వరకు వెలుగులు విరజిమ్ముతూ నూతన శోభను సంతరించుకున్నాయి. ఈ నెల 21 నుంచి 28 వరకు జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ద్వారకాతిరుమల క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఇందులో భాగంగా చేపట్టిన అలంకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి అలంకరణల్లో ప్రత్యేక మార్పులు చేపట్టడంతో క్షేత్రానికి మరింత శోభ వచ్చి చేరింది. ఆలయ రాజగోపురాలు, అనివెట్టి మండపాలు, నిత్య కల్యాణ మండపం, సప్త గోకులం, షాపింగ్ కాంప్లెక్సులు, జంట గోపురాల ప్రాంతాలు ఆకట్టుకుంటున్నాయి. ఆలయ ప్రధాన కూడలి (గుడి సెంటర్)లో ఏర్పాటు చేసిన 40 అడుగుల స్వామి, అమ్మవార్ల విద్యుత్ కటౌట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అలాగే, కొండపైన రిటైనింగ్ వాల్పై ఏర్పాటు చేసిన దశావతారాల విద్యుత్ బోర్డులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దేవస్థానం ఎలక్ట్రికల్ ఏఈ వెంకటేష్ పర్యవేక్షణలో ఈ అలంకరణ పనులు కొనసాగుతున్నాయి.


