జగన్మాత రాక జగమంతా సంబరం | - | Sakshi
Sakshi News home page

జగన్మాత రాక జగమంతా సంబరం

Oct 3 2026 1:26 AM | Updated on Oct 3 2026 1:26 AM

మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలి

ద్వారకాతిరుమల: దుష్టశిక్షణ, శిష్టరక్షణకు ప్రతిరూపమైన జగజ్జనని కనకదుర్గమ్మ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఘనంగా ముస్తాబవుతోంది. ఈ నెల 11 నుంచి 20 వరకు జరిగే ఈ వేడుకలు విజయదశమితో ముగియనున్నాయి. సింహవాహినిగా, మహిషాసురమర్దినిగా అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకునేందుకు భక్తకోటి ఆసక్తిగా ఎదురుచూస్తోంది. గ్రామగ్రామాన ఉత్సవ కమిటీలు మండపాల ఏర్పాటులో నిమగ్నమవ్వగా, విగ్రహాల తయారీ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఏలూరు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, పాలకొల్లు, నరసాపురం, ఎం.నాగులపల్లి తదితర ప్రాంతాల్లో కళాకారులు ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో పాటు పర్యావరణహిత మట్టి విగ్రహాలకు తుదిమెరుగులు దిద్దుతున్నారు.

ప్రసిద్ధ క్షేత్రాల్లో ప్రత్యేక అలంకారాలు

ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలైన భీమవరం మావుళ్లమ్మ, పెనుగొండ వాసవీ కన్యకాపరమేశ్వరి, మహిషాసురమర్థని, నిడదవోలు కోటసత్తెమ్మ, మొగల్తూరు బండి ముత్యాలమ్మ, కొల్లేటికోట పెద్దింట్లమ్మ, పెదవేగి రాట్నాలమ్మ తల్లి ఆలయాలు నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతున్నాయి. సంప్రదాయ నవదుర్గ రూపాలైన శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయనీ, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అలంకారాలతో పాటు కొన్ని క్షేత్రాల్లో బాలాత్రిపురసుందరి, గాయత్రీదేవి, అన్నపూర్ణాదేవి, లలితాత్రిపురసుందరి, మహాలక్ష్మి, సరస్వతి, మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరి రూపాల్లో రోజుకో విశేష అలంకారంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు.

ముమ్మరంగా విగ్రహాల రూపకల్పన

ఉత్సవాలకు కొద్దిరోజులే సమయం ఉండటంతో విగ్రహాల తయారీ ఊపందుకుంది. ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి జాతీయ రహదారి వద్ద భీమడోలుకు చెందిన పేరవరపు నాగేశ్వరరావు కుటుంబం రెండు నెలల ముందే మట్టి విగ్రహాల తయారీని ప్రారంభించి ఆర్డర్లను సిద్ధం చేస్తోంది. మార్కెట్‌లో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారీస్‌ విగ్రహాలు పరిమాణం, ఆకర్షణను బట్టి రూ. 10 వేల నుంచి రూ. 60 వేల వరకు విక్రయిస్తుండగా, మట్టి విగ్రహాలు రూ. 10 వేల నుంచి రూ. 25 వేల వరకు అందుబాటులో ఉన్నాయి.

వైభవంగా ఆధ్యాత్మిక సంబరాలు

జిల్లావ్యాప్తంగా కూడళ్లలో మండపాలు నిర్మించి కుంకుమార్చనలు, చండీ పారాయణాలు, భజనలు, కోలాటాలు, అన్నదానాలు నిర్వహించేందుకు కమిటీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే నిత్యావసరాలు, పూజా సామగ్రి, విద్యుత్‌ అలంకరణల ధరలు పెరగడం ఉత్సవ నిర్వహణ బడ్జెట్‌పై ప్రభావం చూపుతోంది. ఖర్చులు పెరిగినా సంప్రదాయ బద్ధంగా, వైభవంగా వేడుకలు జరిపేందుకు నిర్వాహకులు ప్రణాళికలు రచిస్తున్నారు.

శరన్నవరాత్రులకు ఉమ్మడి పశ్చిమగోదావరి సిద్ధం

ఈ నెల 11 నుంచి 20 వరకు దేవీ నవరాత్రులు

ఆలయాల్లో ప్రత్యేక పూజలు.. ఊపందుకున్న విగ్రహాల తయారీ

పెరిగిన వ్యయభారం.. మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలని వినతి

పీఓపీ విగ్రహాలు ఆకర్షణీయంగా ఉండటంతో మట్టి విగ్రహాలకు ఆదరణ తగ్గుతోంది. పర్యావరణానికి మేలు చేసే మట్టి విగ్రహాలపై విద్యావంతులు అవగాహన కల్పించాలి. ప్రభుత్వం కూడా మట్టి విగ్రహాల తయారీదారులను ఆదుకోవాలి.

– పేరవరపు నాగేశ్వరరావు, విగ్రహాల తయారీదారుడు, ఎం.నాగులపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement