వేలేరుపాడు: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఆదివారం రాత్రి 41.70 అడుగులకు చేరినా వేలేరుపాడు మండలంలో ఉధృతి కొనసాగుతూనే ఉంది. మూడో రోజైన ఆదివారం కూడా 32 గ్రామాలు జల దిగ్బంధనంలోనే ఉన్నా యి. వేలేరుపాడు మండల కేంద్రంలో ఐదు, దిగువ ప్రాంతం టేకూరులో ఏడు, కాకిస్‌నూరులో పది, పేరంటపల్లిలో ఆరు ఇళ్లు ముంపులోనే ఉన్నాయి. మండలంలోని రుద్రమకోట రహదారిలో పెద్దవాగు వంతెన, ఎద్దెలవాగు, టేకూరువాగు, మేళ్లవాగుల వంతెనలు ఇంకా నీటమునిగే ఉన్నాయి. వసంతవాడ నుంచి రుద్రమకోట వెళ్లే రహదారి, కన్నాయిగుట్ట వెళ్లే రహదారి, రేపాకగొమ్ము, తాట్కూరుగొమ్ము, తిర్లాపురం వెళ్లే రహదారి, నార్లవరం–కొత్తూరు రహదారిలో మంచినీటి పంపు ప్రాంతంలో రహదారి వరద నుంచి బయటపడలేదు. ఎడవల్లి, ఎద్దెలవాగు, టేకూరు, వాగుల వద్ద, నార్లవరం కాలనీ, రేపాకగొమ్ము, రుద్రమకోట ప్రాంతాల్లో అధికారులు నాటు పడవలు ఏర్పాటు చేశారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు.


