సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు | - | Sakshi
Sakshi News home page

సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు

Aug 4 2026 1:05 AM | Updated on Aug 4 2026 1:05 AM

ఏలూరు (టూటౌన్‌): కృష్ణా డెల్టా భూములకు సాగునీరు అందించాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ఏలూరు కలెక్టరేట్‌ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్‌ లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం రైతు ప్రతినిధుల బృందం పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌ వెట్రిసెల్వికి వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ దెందులూరు, ఏలూరు నియోజకవర్గాల్లోని కృష్ణా డెల్టా భూములకు ప్రత్యా మ్నాయ మార్గాల ద్వారా గోదావరి జలాలు అందించే అవకాశమున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. జూన్‌ 15 నుంచే నీరిస్తామని చెప్పి, ఎకరాకు రూ.10–15 వేలు పెట్టుబడి పెట్టి నారుమడులు, నాట్లు వేశాక.. ఇప్పుడు సూపర్‌ ఎల్నినో సాకుతో వరి సాగు వద్దనడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. శ్రీశైలం, సాగర్‌, పులిచింతల వద్ద పుష్కలంగా నీరున్నా, పట్టిసీమ ద్వారా నీరు తరలిస్తున్నా సముద్రం పాలు చేస్తున్నారే తప్ప రైతులకు ఇవ్వడం లేదని విమర్శించారు. తక్షణమే పట్టిసీమ జలాలను కృష్ణా డెల్టాకు మళ్లించాలని, పోణంగి పుంత కాలువ పనులను వేగవంతం చేసి ఏలూరు రూరల్‌ పరిధిలోని 10 వేల ఎకరాలకు, అలాగే తాడిపూడి ఆయకట్టుకు నీరందించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్‌.లింగరాజు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు, జిల్లా కమిటీ సభ్యులు గుర్రం రాంబాబు, కృష్ణా డెల్టా ఆయకట్టు రైతులు పైడిపాటి భాస్కరరావు, తలారి జయరాజు, దాసరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement