తణుకు అర్బన్: తణుకు ఆర్టీసీ బస్టాండ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు తణుకు పట్టణ ఎస్‌ఐ సీహెచ్‌వీ సత్యనారాయణ తెలిపారు. సుమారు 55 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి అనారోగ్య కారణాలతో మృతిచెందినట్లు తెలిసిందని. మృతదేహాన్ని తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉంచినట్లు వివరించారు. మృతుడిని గుర్తించిన వారు తణుకు పట్టణ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.
తణుకు అర్బన్: తణుకు పట్టణ పరిధిలోని వెంకటరాయపురంలో ఆదివారం జరిగిన ప్రమాదంలో రామదాసు వెంకటేశ్వరరావు(64) మృతి చెందారు. వెంకటేశ్వరరావు సైకిల్‌పై వెళ్తుండగా ఫిట్స్ రావడంతో ప్రమాదవశాత్తు అదుపు తప్పి కింద పడిపోయారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తణుకు రూరల్ ఎస్‌ఐ నాళం శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పాలకొల్లు సెంట్రల్: ఆటోను వెనుక నుంచి మరో ఆటో ఢీకొట్టిన సంఘటనలో మహిళ మృతి చెందింది. రూరల్ పోలీసుల వివరాల ప్రకారం.. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం చింతపల్లికి చెందిన పడాల పద్మావతి(38) పాలకొల్లులో ఉంటున్న తన సోదరుడి ఇంటికి వెళ్లింది. మధ్యాహ్నం పని చూసుకుని తిరుగు ప్రయాణంలో పాలకొల్లులో ఆటో ఎక్కారు. దిగమర్రు బైపాస్ రోడ్డు వద్దకు వెళ్లేసరికి వెనుక నుంచి మరో ఆటో వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ముందు ఆటోలో ఉన్న పద్మావతి రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు పద్మావతిని హుటాహుటిన పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సాయంత్రం 5:30 గంటలకు మృతి చెందారు. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు.
భీమడోలు: జాతీయ రహదారి భీమడోలు అయ్యప్పస్వామి ఆలయం వద్ద శనివారం రాత్రి బైక్ అదుపు తప్పిన ఘటనలో ఒక వ్యక్తి జారి పడి మృతి చెందాడు, ఏలూరుకు చెందిన పందిరిపల్లి రాము (59), విజయవాడకు చెందిన సంతాట సురేష్‌లు బాదంపూడిలో వడ్రంగి పనులు చేసేందుకు ఏలూరు నుంచి వస్తున్నారు. బైక్‌పై ఏలూరు వెళ్తుండగా, అయ్యప్ప స్వామి ఆలయం వద్దకు వచ్చేసరికి బైక్ ఒక్కసారిగా అదుపుతప్పడంతో రోడ్డుపై జారి పడ్డారు. బైక్ నడుపుతున్న రాముకు తలకు తీవ్ర గాయాలయ్యాయి. రామును అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. సురేష్‌కు తీవ్ర గాయాలు కాగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. భీమడోలు ఎస్సై ఎస్‌కే మదీనా బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ముదినేపల్లి(కై కలూరు): భర్త వేధింపులు తాళలేక భార్య పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ముదినేపల్లి మండలం వైవాకలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వైవాక గ్రామానికి చెందిన నగుళ్ళ నరసింహరావుతో కై కలూరు మండలం వరహాపట్నంకు చెందిన వెంకట సత్యవతికి వివాహం జరిగింది. ఇటీవల పలు సార్లు భార్యభర్తల మద్య విభేదాలు రావడంతో సత్యవతి పుట్టింటికి వెళ్లింది. పెద్దలు సర్దిచెప్పి పంపించేవారు. ఆదివారం తిరిగి భర్త, అత్తతో గొడవ జరగడంతో మనస్తాపం చెంది సత్యవతి పురుగు మందు తాగింది. ఆమెను గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కై కలూరు: వేగంగా ఇద్దరు యువకులు వాహనంతో ఢీకొట్టిన ఘటనలో కై కలూరుకు చెందిన తాపీమేస్తీ గంధం రామయ్య(65) మరణించాడు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్దకు రామయ్య వాహనంపై వస్తుండగా పశ్చిమగోదావరి జిల్లా ఉండి గ్రామానికి చెందిన కొత్తపల్లి బాను, చందక ఉమామహేశ్వరరావులు అతి వేగంగా వాహనంతో ఢీకొట్టారు. రామయ్యను కై కలూరు ప్రభుత్వాసుపత్రి అక్కడ నుంచి ఏలూరు ప్రభుత్వాసుపత్రి తరలించారు. చికిత్స పొందుతూ మరణించాడు. వాహనంతో ఢీకొట్టిన యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది.


