నరసాపురం రూరల్: నరసాపురం మండలంలో గోదావరి వరద ఉధృతి ఆదివారం మధ్యాహ్నం నుంచి క్రమంగా పెరుగుతోంది. ఎగువన ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో, దిగువకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో నరసాపురం మండల పరిధిలోని కొత్త నవరసపురం ఎస్టీ కాలనీతో పాటు పలు లోతట్టు ప్రాంతాలు ఆదివారం సాయంత్రానికి జలమయమయ్యాయి. పరిస్థితిని సమీక్షించేందుకు తహసీల్దార్ నాగార్జున ఆయా ప్రాంతాల్లో నిరంతరం పర్యటిస్తున్నారు. వరద ప్రభావం మరింత పెరిగితే బాధితులను సోమవారం నాటికి పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశామని, సిద్ధంగా ఉండాలని ప్రజలకు అధికారులు సూచించారు. ముందస్తు చర్యల్లో భాగంగా రెవెన్యూ, పంచాయతీ, సచివాలయ సిబ్బందితో నిరంతర గస్తీ ఏర్పాటు చేశారు. అలాగే కొత్త నవరసపురం, పాత నవరసపురం గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి బాధితులకు సేవలందిస్తున్నారు. వరద ముప్పు పెరిగితే తీసుకోవాల్సిన తదితర చర్యలపై సిబ్బందికి తహసీల్దార్ దిశానిర్దేశం చేశారు.


