వ్యాపారం అంతంత మాత్రమే
అమ్మకాలు పడిపోయాయి
గణపవరం: ఏటా తొలకరి వచ్చిందంటే నారు వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లు ఉండేది. జూన్ ఆరంభం నుంచి సుమారు నాలుగు నెలల పాటు ఈ వ్యాపారం జోరుగా సాగుతుంది. వివిధ రకాల కూరగాయలు, పూలమొక్కలు, విత్తనాలను వారపు సంతలతో పాటు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి అమ్ముతూ సుమారు 200 మంది చిరు వ్యాపారులు జీవనోపాధి పొందుతున్నారు. గణపవరం మండలం వల్లూరు, ముగ్గుళ్ల గ్రామాలకు చెందిన రైతులు దశాబ్దాలుగా నారు మొక్కలు సాగు చేస్తూ జిల్లాలోని పలు సంతల్లో అమ్ముతుంటారు. వర్షాలు పడగానే వంగ, టమాటా, పచ్చిమిర్చి, బంతి, చామంతి, గులాబి వంటి పూలమొక్కల నారును విక్రయిస్తారు. వీటితో పాటు తోటకూర, పాలకూర, బీర, బెండ వంటి పలు రకాల కూరగాయల విత్తనాలను సైతం అమ్ముతుంటారు. సంతలు లేని రోజుల్లో గ్రామాల్లో సైకిళ్లపై తిరుగుతూ రోజుకు మూడు నుంచి నాలుగు వేల రూపాయల వరకూ వ్యాపారం చేస్తుంటారు.
ఎల్‌నినోతో కష్టాలు
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు మొహం చాటేయడం నారు వ్యాపారాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. గత రెండు నెలలుగా వర్షాలు లేకపోవడంతో నారు మొక్కలు కొనేవారే కరువయ్యారు. దీనితో మొక్కలు ముదిరిపోయి వ్యాపారులకు నష్టాలు మిగిలాయి. విత్తనాలు కూడా అమ్ముడుపోక నిరుపయోగంగా మారే ప్రమాదం ఉందని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. సాధారణంగా జూన్, జూలై నెలల్లో రైతులు పొలాల గట్ల మీద, ప్రజలు తమ ఇళ్ల పెరటిలో కూరగాయల మొక్కలు నాటుతుంటారు. కానీ, ఈ ఏడాది ఎండల తీవ్రతకు నాటిన మొక్కలు చనిపోతుండటంతో నారు పెంచడానికి ప్రజలు ఆసక్తి చూపడం లేదు. దీనితో నారునే నమ్ముకున్న వ్యాపారులు జీవనోపాధి కోల్పోయారు.
వల్లూరు నారుకు డిమాండ్
వల్లూరు, ముగ్గుళ్ల గ్రామాల్లో సాగుచేసే నారుకు జిల్లా వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంటుంది. ఈ గ్రామాలకు చెందిన రైతులు నాలుగు దశాబ్దాలుగా పొలం గట్లు, ఖాళీ స్థలాలు, చెరువు గట్ల మీద వివిధ రకాల నారు సాగు చేస్తుంటారు. 20 సెంట్ల నారుమడి తయారీ, సస్యరక్షణకు సుమారు రూ.30 నుంచి 40 వేల వరకు ఖర్చవుతుంది. మే చివరి వారంలో నారు మడులు వేసి జూన్ రెండో వారం నుంచి విక్రయిస్తారు. ఇక్కడి వంగ, మిరప, టమాటా నారు మంచి దిగుబడి ఇస్తాయని పేరు. అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల గతంలో మాదిరిగా అమ్మకాలు లేవని వ్యాపారులు వాపోతున్నారు.
కోతుల బెడదతో తగ్గిన ఆసక్తి
గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల వద్ద ఖాళీ స్థలాలు, పొలం గట్లపై ప్రజలు, రైతులు ఎంతో ఆసక్తిగా కూరగాయలు పండించేవారు. కానీ, కొన్నేళ్లుగా కోతుల బెడద ఎక్కువైంది. కోతుల గుంపులు కష్టపడి పెంచిన మొక్కలను పీకేస్తూ, పందిళ్లను పాడు చేస్తున్నాయి. దీంతో ప్రజల్లో ఆసక్తి సన్నగిల్లి, ఆ ప్రభావం నారు వ్యాపారంపై పడింది.
అమ్మకాలు లేక వ్యాపారం వెలవెల
రెండు దశాబ్దాలుగా వారపు సంతల్లో నారు వ్యాపారం చేస్తున్నా, ఇప్పుడున్నంత గడ్డు పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. కరోనా సమయంలో దెబ్బతిన్న వ్యాపారం, మళ్లీ ఇప్పుడు ఎల్‌నినో వల్ల దారుణంగా పడిపోయింది. నారు పెంపకం, సస్యరక్షణ కోసం రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టాం. కానీ సంతలో రోజుకు కనీసం వెయ్యి రూపాయలు అమ్మడమే గగనంగా మారింది. నారు ముదిరిపోయి వృథా అవుతోంది. ప్రభుత్వం మా లాంటి చిరు వ్యాపారులకు సబ్సిడీ రుణాలు ఇచ్చి ఆదుకోవాలి. మంగెన రాంబాబు, నారు వ్యాపారి
గతంలో వారపు సంతల్లో రోజుకు రూ.3–4 వేల వ్యాపారం జరిగేది. ఇప్పుడు రోజుకు నాలుగైదు వందలు అమ్మడమే కష్టంగా ఉంది. వర్షాభావ పరిస్థితుల వల్ల మహిళలు పూల మొక్కల పెంపకంపై ఆసక్తి చూపడం లేదు. గతంలో రైతులు, ఆక్వా రైతులు చెరువు గట్లపై కూరగాయల మొక్కలు నాటేవారు. ఈ ఏడాది వర్షాలు లేక వారు కూడా కొనుగోలుకు ముందుకు రాకపోవడంతో అమ్మకాలు దారుణంగా పడిపోయాయి.
బేతు శ్రీనివాసరావు, నారు వ్యాపారి


