న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2026
వేలేరుపాడు: నిన్న మొన్నటి వరకు ఇసుక తెన్నెల్లో ఉన్న గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఉగ్ర రూపం దాల్చింది. భద్రాచలం వద్ద శుక్రవారం రాత్రి నుంచే మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది, దీంతో గోదావరి పరీవాహక ప్రాంతవాసులు భయంతో వణికిపోతున్నారు. భద్రాచలం వద్ద శనివారం రాత్రి 9 గంటలకు నీటిమట్టం 54.50 అడుగులు పెరగడంతో 15,02,258 క్యూసెక్కుల వరద నీరు సముద్రంలో కలుస్తోంది. శనివారం వేలేరుపాడు మండలంలోని పలు గ్రామాల్లో ఇళ్లు నీట మునగ్గా.. మరికొన్ని గ్రామాలు జలదిగ్బంధనంలోనే ఉన్నాయి. ఏ క్షణాన నీటిమట్టం పెరుగుతుందో అన్న భయంతో పరీవాహక ప్రజలకు కళ్లపై కునుకులేకుండా పోయింది. రెండో రోజు కూడా మండలంలో 32 గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. దిగువ ప్రాంతంలో వేలేరుపాడు మండల కేంద్రంలో ఐదు, టేకూరులో ఏడు, కాకిస్‌నూరులో పది, పేరటపల్లిలో ఆరు ఇళ్లు నీటమునిగాయి. దిగువ ప్రాంతంలో 16 గిరిజన గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఆయా గ్రా మాల్లో ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. మండలంలో పెద్దవాగు, ఎద్దెలవాగు, టేకూరు వా గు, మేళ్లవాగుల మీదుగా గోదావరి నీరు చేరడంతో రహదారులన్నీ నీటమునిగాయి. వేలేరుపాడు నుంచి రుద్రమకోట వెళ్లే రెండు వైపులా ఉన్న రహదారులు నీట మునిగాయి. వసంతవాడ నుంచి రుద్రమకోట వెళ్లే రహదారి, కన్నాయిగుట్ట వెళ్లే రహదారి, రేపాకగొమ్ము, తాట్కూరుగొమ్ము, తిర్లాపురం వెళ్లే రహదారులన్నీ నీటమునిగాయి. నార్లవరం–కొత్తూరు రహదారిలో మంచినీటి పంపు ప్రాంతంలో రహదారి నీట మునిగింది. ఎడవల్లి, ఎద్దెలవాగు, టేకూరు, వాగుల వద్ద, నార్లవరం కాలనీ, రేపాకగొమ్ము, రుద్రమకోట ప్రాంతాల్లో అధికారులు నాటు పడవలు ఏర్పాటు చేశారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు వీటిపై రాకపోకలు సాగిస్తున్నారు. జల దిగ్బంధనంలో ఉన్న రేపాకగొమ్ము గ్రామంలో 186 కుటుంబాలను తాడువాయి, కుక్కునూరు మండలం రాయికుంట, పునరావాస కాలనీ, వారి బంధువుల ఇళ్లకు తరలించినట్టు అధికారులు చెబుతున్నారు.
వరద గోదావరి
రెండోరోజూ జల దిగ్బంధంలోనే 32 గ్రామాలు
వేలేరుపాడు, టేకూరు, కాకిస్‌నూరు, పేరంటపల్లిలో నీటమునిగిన ఇళ్లు
ముంపులో రహదారులు.. స్తంభించిన రాకపోకలు
భద్రాచలంలో మూడో ప్రమాద హెచ్చరిక జారీ
భయం గుప్పిట్లో నదీ పరీవాహక జనం


