ద్వారకాతిరుమల: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 5న పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు దేవరపల్లి వస్తున్న సందర్భంగా పార్టీ నేతలు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. కార్యక్రమానికి భారీ సంఖ్యలో తరలిరానున్న పార్టీ శ్రేణులు, అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏ ర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కార్యాచరణను వేగవంతం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురామ్, మాజీ మంత్రులు తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, విశాఖ స్మార్ట్‌సిటీ మాజీ చైర్మన్ జీవీ తదితరులు శనివారం దేవరపల్లిలోని ఎంపీపీ కుప్పాల దుర్గారావు నివాసంలో సమావేశమయ్యారు. సభా ప్రాంగణ ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, తాగునీరు, భోజనం, రాకపోకలు, ఇతర మౌలిక సౌకర్యాలపై విస్తృతంగా సమీక్షించారు. కార్యక్రమం విజయవంతానికి పార్టీ శ్రేణులు స మన్వయంతో పనిచేయాలని నేతలు సూచించారు. పార్టీ నాయకులు బంకా అప్పారావు, వెల్లంకి సుబ్రహ్మణ్యం, చెలికాని ప్రవీణ్, భోగరాజు సాయికృష్ణ, దాసరి రాంబాబు, షేక్ బాషా, కూచిపూడి సతీష్, కూసంపాటి మోహన్‌రెడ్డి, వెలగా శ్రీరామూర్తి తదితరులు పాల్గొన్నారు.


