పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలి | - | Sakshi
Sakshi News home page

పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలి

Jul 30 2026 1:21 AM | Updated on Jul 30 2026 1:21 AM

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లా పారిశ్రామిక అభివృద్ధికి నూతన, మహిళా పారిశ్రామికవేత్తలు ముందుకురావాలని కలెక్టర్‌ కే.వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్‌లోని గౌతమీ సమావేశ మందిరంలో జిల్లా పారిశ్రామిక, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా లోని గిరిజన ప్రాంతాల్లో పరిశ్రమలు, అన్నిరకాల ఫుడ్‌ ప్రాసెసింగు యూనిట్ల స్థాపనకు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గిరిజన తండాల్లో యువతీ యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత పెంచి, ఆ కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయాలని పేర్కొన్నారు. జిల్లాలో రెండవ విడత ఫుడ్‌ ప్రాసెసింగు యూనిట్ల ఏర్పాటు లక్ష్యం 130 కాగా, ఇప్పటివరకు 45 యూనిట్లను గుర్తించామన్నారు. వీటిలో 11 మంజూరు కాగా, వివిధ బ్యాంకుల్లో 20 పెండింగ్‌లో ఉన్నాయని, ఆగస్టు 15వ తేదీ నాటికి బ్యాంకుల్లోని దరఖాస్తులను మంజూరు చేయించి పనులు మొదలుపెట్టించాలని ఆదేశించారు. చింతలపూడి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్‌ పార్కుల ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయని, ఉత్సాహవంతులైన పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరారు. ఉంగుటూరు, దెందులూరు, నూజివీడు నియోజకవర్గాల్లో స్థలసేకరణ పూర్తయిందని, మిగతా ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. సింగిల్‌ విండో పథకం ద్వారా త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని, అవసరాన్ని బట్టి ఒక్క రోజులోనే మంజూరు చేసి ప్రతి యూనిట్‌ను ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎంజే అభిషేక్‌ గౌడ, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం ఆర్‌.వెంకటరావు, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజరు కే.బాబ్జీ, నగర పాలక సంస్థ కమిషనరు ఏ.భానుప్రతాప్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఈఈ ఏ.శ్రీరామచంద్రమూర్తి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జేడీ వై.విశ్వమోహన్‌ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ యూ.శోభ, డ్వామా పీడీ కే.వెంకట సుబ్బారావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కే.షాజానాయక్‌, డీఆర్‌డీఏ పీడీ టి.విజయలక్ష్మి, జిల్లా పంచాయతీ శాఖ అధికారి జీ.మల్లికార్జున రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement