ద్వారకాతిరుమల: రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగి సకాలంలో వర్షాలు కురవాలని కోరుతూ ద్వారకాతిరుమల క్షేత్ర పాలకుడైన శ్రీ భ్రమరాంబా మల్లేశ్వరస్వామి ఆలయంలో బుధవారం వరుణానువాక జపం వైభవంగా ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరిగే ఈ ప్రత్యేక క్రతువుల్లో భాగంగా తొలిరోజు వరుణదేవుని అనుగ్రహం కోసం పండితులు వేద మంత్రోచ్ఛరణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా పండితులు ఆలయంలో గణపతిపూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాశనం, వృష్యశృంగ ప్రతిమ ప్రధాన మండప ఆరాధనలు, సహస్రఘట మండప ఆవాహనలు, వృష్య శృంగ మహామంత్ర వరుణ జపాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు దంపతులు, దేవస్థానం ట్రస్టుబోర్డు సభ్యులు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ వర్షాభావం తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలని, దేశం–రాష్ట్రం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని లోకకళ్యాణార్థం ఈ క్రతువును చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ పూజలు ఈనెల 31 వరకు జరుగుతాయని ఈఓ పేర్కొన్నారు.


