కై కలూరు: అజ్ఞానం నుంచి జ్ఞానమార్గానికి నడిపించే బృహత్తర బాధ్యతను గురువు మాత్రమే స్వీకరిస్తారని పలువురు వక్తలు పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా బుధవారం గురు పౌర్ణమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.సీఎన్నార్ గార్డెన్స్‌లో... ఓమౌజయా గురు పౌర్ణమి మహోత్సవం సీఎన్నార్ గార్డెన్‌లో వైభవంగా జరిగింది. దాదాపు 1,700 మంది భక్తుల సమక్షంలో మహా గాయత్రీ గురు ఖడ్గ యజ్ఞం నిర్వహించారు. కై కలూరు కేంద్రం నుంచి 300 మందికి పైగా మహిళలతో స్వయంభూ శక్తిపీఠ మహా ర్యాలీ చేపట్టారు. అనంతరం కలశ పూజ, పరా నాగేంద్రి మహా హారతి, భక్తి గీతాల ఆవిష్కరణ, ప్రసాద వితరణ, మహా అన్నదానం నిర్వహించారు. స్థానిక వీరభ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో జరిగిన వేడుకల్లో మహిళలకు సారె అందజేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు టేకి వెంకట సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో మహా చండీ సహిత రుద్రహోమం చేశారు. పొన్నూరు బ్రహ్మజీ, కంచర్ల జగదీష్, కంతేటి నాగ వెంకట వరప్రసాద్ హోమంలో పాల్గొని పూజలు నిర్వహించారు.


