ద్వారకాతిరుమల: శ్రీవారి దేవస్థాన గజలక్ష్మి నుదుటన అలంకరించేందుకు ప్రత్యేక నెట్టిపట్టంను ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు దంపతులు బుధవారం బహూకరించారు. ముందుగా గజలక్ష్మిని దర్శించుకున్న వారు బెల్లం, పుచ్చకాయలను ఆహారంగా తినిపించి ఆశీర్వచనం పొందారు. అనంతరం ఆలయ ట్రస్టుబోర్డు సభ్యులతో కలసి నెట్టిపట్టాన్ని మావటి రంగాకు అందజేసి, దానిని గజలక్ష్మికి అలంకరించాలని ఈఓ సూచించారు.
భీమవరం (ప్రకాశంచౌక్) : పట్టణంలోని పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామివారి దేవస్థానంలో కొబ్బరి చెక్కలను పోగు చేసుకునే హక్కు కోసం బుధవారం నిర్వహించిన బహిరంగ వేలం పాట ముగిసింది. ఏనుగులంకకు చెందిన నారిన లక్ష్మీ శివసాయి సీతారాం రూ.17,05,000 గరిష్ట పాటకు లైసెన్స్ దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో తనిఖీదారు పి.సాయికుమారి, ధర్మకర్తల మండలి చైర్మన్ చింతలపాటి బంగార్రాజు, సభ్యులు పడమటి లీలా, పాల వెంకటస్వామి, యార్లగడ్డ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ముదినేపల్లి(కై కలూరు) : రోడ్డు ప్రమాదంలో వైన్‌షాపు క్యాషియర్ మృతి చెందిన ఘటనపై ముదినేపల్లి పోలీసు స్టేషన్‌లో బుధవారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ముదినేపల్లికి చెందిన ఉప్పునూతల రమేష్(44) గుడివాడ మండలం మోటూరు వైన్‌షాపులో క్వాషియర్‌గా పని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా పెయ్యేరు సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొట్టడంతో రమేష్‌కు తలకు తీవ్ర గాయమైంది. మెరుగైన చికిత్స కోసం గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అతను మరణించాడు. మృతుడు భార్యకు విడాకులు ఇచ్చి తల్లి వద్ద ఉంటున్నాడు. తల్లి జయమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
తణుకు అర్బన్ : బైక్ చోరీల కేసులో నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష పడినట్లు ఎస్‌ఐ ఎన్. శ్రీనివాసరావు తెలిపారు. తణుకు మండలం వీరభద్రపురానికి చెందిన మల్లిపూడి సుధీర్‌పై రెండు చోరీ ఘటనలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. బుధవారం అతడిని కోర్టులో హాజరుపరచగా, విచారించిన ప్రిన్సిపల్ సివిల్ జడ్జి రెడ్డిపోగు ఆశీర్వాదం పాల్ 6 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ ఇ.హనుమంతరావు వాదించగా, ఎస్సైలు ఎన్వీ త్రిమూర్తులు, ఎన్. శ్రీనివాసరావు, కోర్టు కానిస్టేబుల్ జి. దుర్గారావు సహకరించారు.
భీమవరం: భీమవరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చినఅమిరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు హెడ్ కానిస్టేబుల్ భూషణం బుధవారం విలేకరులకు తెలిపారు. కోపల్లె గ్రామానికి చెందిన ఆర్. సాయివర్మ మంగళవారం రాత్రి మోటారుసైకిల్‌పై భీమవరం వస్తుండగా, చినఅమిరం వద్ద ఎదురుగా వచ్చిన మరొక బైక్ దాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కాళ్లకు తీవ్ర గాయాలైన సాయివర్మ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ చెప్పారు.
ద్వారకాతిరుమల: సెల్‌ఫోన్ వివాదంలో ఓ లారీ డ్రైవర్‌పై ఆరుగురు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేసిన సంఘటనపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బుధవారం కేసు నమోదైంది. ఎస్సై టి.సుధీర్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని శరభాపురం గ్రామానికి చెందిన కండవల్లి ప్రవీణ్ లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతనికి పరిచయమున్న సీతారాముడు అనే వ్యక్తి సెల్‌ఫోన్ పోవడంతో, దాన్ని అదే గ్రామానికి చెందిన మిండా గోపాలకృష్ణ కుమారుడు దొంగిలించి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారంలో ప్రవీణ్, సీతారాముడి తరఫున మాట్లాడాడు. దీంతో ఆగ్రహం పెంచుకున్న శరభాపురానికే చెందిన కొరపాటి సురేష్ ఈ నెల 25న కర్రతో ప్రవీణ్ తలపై గట్టిగా కొట్టగా, అతని తలకు తీవ్ర గాయమైంది. అనంతరం అదే గ్రామానికి చెందిన కొరపాటి సుబ్బారావు, కొరపాటి దినేష్, పవన్ కుమార్, మిండా రోహిత్, మిండా గోపాలకృష్ణలు ప్రవీణ్‌ను చేతులు, కాళ్లతో విచక్షణారహితంగా కొట్టడంతో అతను అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన స్థానికులు వెంటనే అతడిని భీమడోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రవీణ్ అక్కడ చికిత్స పొందుతున్నాడు. బాధితుడు ఆసుపత్రి నుంచి ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా బుధవారం ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.


