ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్
భీమవరం (ప్రకాశంచౌక్) : విద్య, వైద్య రంగాలతో పాటు అన్ని రంగాల్లో పశ్చిమగోదావరి జిల్లాను వికసిత్ జిల్లాగా రూపుదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కృషి చేస్తున్నాయని ఇరవై సూత్రాల కార్యక్రమ అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. బుధవారం భీమవరంలోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలసి కేంద్ర పథకాలు, ప్రాజెక్టుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లంకా దినకర్ మాట్లాడుతూ అనీమియా ముక్త్ భారత్ పథకంలో భాగంగా 19 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉన్న వారితో పాటు ప్రధానంగా 5 నుంచి 19 ఏళ్ల పిల్లలకు, గర్భిణులకు వైద్య సేవలు అందిస్తూ ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం ప్రాంతాల్లో మొబైల్ ఐసీటీఎస్ ద్వారా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కింద జిల్లాలోని 88,951 మంది విద్యార్థులకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, బెల్టు, షూలు సహా 9 రకాల వస్తువులతో కూడిన స్టూడెంట్ కిట్లను అందజేస్తున్నామని వివరించారు. జలజీవన్ మిషన్ కింద జిల్లాలో ఇప్పటివరకు 3,09,839 తాగునీటి కనెక్షన్లు ఇచ్చినట్లు తెలిపారు. భీమవరం పట్టణంలో ప్రస్తుతం ఉన్న ట్యాంకుల ద్వారా మంచినీరు సరఫరా జరుగుతున్నప్పటికీ, భవిష్యత్తు అవసరాల కోసం ముందస్తుగానే కొత్త స్టోరేజ్ ట్యాంకుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే పీఎం సూర్య ఘర్ పథకంలో భాగంగా జిల్లాలోని 318 గ్రామాల్లో నూరు శాతం విద్యుదీకరణ పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కేఆర్ కల్పశ్రీ, డీఆర్‌ఓ కె. ప్రభాకర్, భీమవరం ఆర్డీఓ కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, సీపీఓ శివపార్వతి తదితరులు పాల్గొన్నారు.


