బుట్టాయగూడెం: ఆదివాసీల హక్కులను పరిరక్షించాలని, జీఓ నంబర్ 3తో పాటు 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం కేఆర్ పురం వద్ద చలో ఐటీడీఏ కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టి, ఐటీడీఏ కార్యాలయం ఎదుట నిరసన నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.అశోక్, గిరిజన సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు కారం దారయ్య, జీఎస్‌పీ జిల్లా నాయకుడు రమేష్, సంక్షేమ పరిషత్ నాయకుడు సోదెం ముక్కయ్య మాట్లాడుతూ గిరిజనుల రాజ్యాంగబద్ధ హక్కులను ప్రభుత్వం పరిరక్షించాలని, జీఓ–3 అమలుపై అలసత్వం వహించకుండా స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తమ డిమాండ్లతో ఉన్న వినతిపత్రాన్ని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కె.రాములు నాయక్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు తెల్లం రామకృష్ణ, ధర్ముల రమేష్, జాతీయ ఆదివాసీ పాస్టర్స్ సంఘం ఉపాధ్యక్షుడు ఫిలిప్స్, గిరిజన నాయకురాలు మోడియం నాగమణి తదితరులు పాల్గొన్నారు. చలో ఐటీడీఏ నేపథ్యంలో కేఆర్‌పురం వద్ద పోలవరం డీఎస్పీ కె. జయకృష్ణ, జీలుగుమిల్లి సీఐ బి.యాదగిరి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


