ఏలూరు (టూటౌన్) : గిరిజనులకు రాజ్యాంగపరమైన హక్కులు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు సక్రమంగా అందేలా చూడాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉందని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి తెలిపారు. శనివారం ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల్లో రోస్టర్ ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు, ఎస్టీ బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీ, ఇతర గిరిజన సమస్యలపై అధికారులతో సమీక్షించారు. గత రెండు రోజులుగా జిల్లాలో పర్యటించి గిరిజనుల నుండి సేకరించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ.. గిరిజన సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. పీజీఆర్‌ఎస్ వినతులను సత్వరం పరిష్కరిస్తున్నామన్నారు. ఇప్పటివరకు విద్యుత్ సౌకర్యం లేని రెండు మండలాల్లోని మూడు గ్రామాలకు సోలార్ విద్యుత్ అందించామని, ఐదు గిరిజన మండలాల్లో ఉపాధి హామీ కింద రూ. 30 కోట్లతో రహదారులను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.
గిరిజనుల నుంచి 26 అర్జీల స్వీకరణ
కమిషన్ పర్యటన సందర్భంగా గిరిజనుల నుంచి 26 అర్జీలు వచ్చాయి. పోలవరం పరిధిలో 19 గ్రామాలకు చెందిన, 18 ఏళ్లు నిండిన 375 మందికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ మంజూరు చేయాలని కొండ్రుకోటకు చెందిన గిరిజనులు కోరారు. దాట్లవారిగూడెం మహిళలు ఎల్‌టీఆర్ కేసులను పరిష్కరించాలని, అలాగే 2013 భూసేకరణ చట్టం ప్రకారం కాలువ ఆయకట్టు పరిధిలోని భూసేకరణ వల్ల గిరిజనులకు ఇబ్బంది లేకుండా చూడాలని వినతులు సమర్పించారు. సమావేశంలో ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్, కమిషన్ సభ్యులు కాకి లక్ష్మి, గొర్లె సునీత, జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ కట్టా సాంబయ్య, ఐటీడీఏ పీవో కె. రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి


