వినూత్న నిరసనకు రైతులు సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

వినూత్న నిరసనకు రైతులు సన్నద్ధం

Jun 3 2026 12:51 AM | Updated on Jun 3 2026 12:51 AM

తక్షణం ప్రభుత్వం స్పందించాలి

మృగశిర కార్తె వేళ వినూత్న నిరసన

ఆక్వా రంగంలోని సమస్యలపై ఆందోళన

ఈనెల 8న ఉచిత భోజనాలతో రైతుల నిరసన

నాయకత్వం వహించేది కూటమి నేతలేనా?

భీమవరం: ఆక్వా ఫీడ్‌, సీడ్‌ ధరల విపరీత పెంపు, రొయ్యల ధరలు పతనం కావడం, సబ్సిడీ విద్యుత్‌ అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆక్వా రైతులు ప్రభుత్వంపై వినూత్న నిరసనకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో దాదాపు 90 వేల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. ఈ నేపథ్యంలో, ఈ నెల 8వ తేదీన మృగశిర కార్తె ప్రవేశం సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలకు రొయ్యలు, చేపల కూరలతో ఉచిత భోజన వసతి కల్పించి తమ నిరసనను తెలపాలని రైతులు నిర్ణయించారు.

రైతులు ఉక్కిరిబిక్కిరి

ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా, ఫీడ్‌, సీడ్‌ ధరలు విపరీతంగా పెంచడంతో రైతులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీనికి తోడు రొయ్యల ధరల్లో నిలకడ లేకపోవడం, కొనుగోలుదారులు సిండికేట్‌గా మారి ధరలను తగ్గించేస్తుండటంతో రైతులు నష్టపోతున్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ మే నెలలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని రైతులంతా ఏకమై పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. వీరవాసరంలో ఫీడ్‌ బస్తాలను తగులబెట్టి మరీ నిరసన తెలిపారు. ఆక్వా జోన్ల ప్రమేయం లేకుండా ఆక్వా రైతులందరికీ సబ్సిడీ విద్యుత్‌ వర్తింపజేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యుత్‌ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేపట్టి, అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.

మూకుమ్మడిగా రోడ్డెక్కిన రైతులు

ఆక్వా సాగు చేస్తున్న రైతులు విభిన్న రాజకీయ పార్టీలకు మద్దతుదారులుగా ఉన్నప్పటికీ, సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడు రాజకీయాలను పక్కనబెట్టి అంతా ఒక్కటయ్యారు. అయితే, ఈ ఆందోళన కార్యక్రమాలకు ఎక్కువగా టీడీపీ, జనసేన, బీజేపీ స్థానిక నాయకులే నాయకత్వం వహిస్తుండటం విశేషం. పార్టీలతో సంబంధం లేకుండా రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఈ పోరాటం సాగుతోంది.

ఆక్వా ఫీడ్‌ ధరలపై తేలని నిర్ణయం

గత నెలలో ఫీడ్‌ ఉత్పత్తి కంపెనీలు ధరలను విపరీతంగా పెంచడంతో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఒకేసారి టన్ను ఫీడ్‌ ధరను రూ. 16 వేలకు పెంచడంతో, ప్రభుత్వం ఫీడ్‌ కంపెనీల యజమానులతో అత్యవసర సమావేశం నిర్వహించింది. దీనివల్ల ధరల పెంపు తాత్కాలికంగా నిలిచిపోయినప్పటికీ, ముడిసరుకుల ధరలు పెరగడం వల్ల భవిష్యత్తులో ధరలు పెంచక తప్పదని కంపెనీల యజమానులు స్పష్టం చేశారు. దీంతో ఎప్పుడైనా ధరలు మళ్లీ పెరగొచ్చనే ఆందోళనలో రైతులు ఉన్నారు.

సబ్సిడీ విద్యుత్‌పై వెలువడని స్పష్టత

ఆక్వా జోన్లతో సంబంధం లేకుండా సాగు చేస్తున్న రైతులందరికీ సబ్సిడీ విద్యుత్‌ ఇవ్వాలనే డిమాండ్‌పై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి సానుకూల ప్రకటన రాలేదు. జిల్లాలో సుమారు 16,332 ఆక్వా విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా, వాటిలో రెండు వేలకు పైగా రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం లభించడం లేదు. ఇటువంటి తరుణంలో పెట్టుబడులు పెరిగి, ఆదాయం తగ్గడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

రొయ్యల ధరల పతనం, ఫీడ్‌, సీడ్‌ ధరల పెరుగుదలపై ప్రభుత్వం తక్షణం స్పందించాలి. పెంచిన ఫీడ్‌ ధరలను తాత్కాలికంగా తగ్గించడం సరిపోదు, భవిష్యత్తులో ధరలు పెంచకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. అలాగే రొయ్యల ధరలు నిలకడగా ఉండేలా కట్టుదిట్టమైన వ్యవస్థను తీసుకురాకపోతే ఆక్వా రైతుల మనుగడ కష్టమవుతుంది.

– భోగిరెడ్డి శ్రీనివాసరావు, ఆక్వా రైతు, తోలేరు

ప్రభుత్వంపై ఇప్పటికే పలు రూపాల్లో పోరాటం చేసిన ఆక్వా రైతులు, ఈసారి మరింత వినూత్నంగా నిరసన తెలపనున్నారు. ఈ నెల 8న మృగశిర కార్తె సందర్భంగా పాలకొల్లు, నరసాపురం, మార్టేరు తదితర ప్రాంతాల్లో ప్రజలకు ఉచితంగా చేపలు, రొయ్యల భోజనాలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమానికి నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌, టీడీపీకి చెందిన పాలకొల్లు ఏఎంసీ మాజీ చైర్మన్‌ గొట్టుముక్కల గాంధీ భగవాన్‌ రాజు వంటి కూటమి నాయకులే మద్దతుగా నిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ స్పందిస్తూ.. ఆక్వా రైతులు కూడా పత్తి రైతుల మాదిరిగానే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందంటూ విడుదల చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో కలకలం రేపుతోంది. మొత్తం మీద కూటమి ప్రభుత్వంలోని పార్టీల నాయకులే ఈ ఆందోళనల్లో ముందుండటం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement