డీఎస్పీ సారూ.. పీజీఆర్‌ఎస్‌కు హాజరుకారు | - | Sakshi
Sakshi News home page

డీఎస్పీ సారూ.. పీజీఆర్‌ఎస్‌కు హాజరుకారు

May 12 2026 12:44 AM | Updated on May 12 2026 12:44 AM

జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్‌కు పోలీసు ఉన్నతాధికారులు హాజరుకాని వైనం

పోలీసు కేసుల ఫిర్యాదుల పరిష్కారంపై అలసత్వం

భీమవరం (ప్రకాశంచౌక్‌): జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్‌కు అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు హాజరవుతుంటే డివిజన్‌ స్థాయిలోని డీఎస్పీ మాత్రం హాజరు కావడం లేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా పోలీస్‌ కేసులకు సంబంధించి అనేక సమస్యలపై వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం చూపుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌తోపాటు డీఎస్పీ స్థాయి అధికారి పాల్గొనాలి. దీని ప్రకారం భీమవరం కలెక్టరేట్‌లో జరిగే పీజీఆర్‌ఎస్‌కు సమీపంగా ఉన్న భీమవరం డీఎస్పీ రఘువీర్‌ విష్ణు హాజరుకావాలి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భీమవరం డీఎస్పీలుగా పనిచేసిన అధికారులెవ్వరూ పీజీఆర్‌ఎస్‌కు రావడం లేదు. కనీసం సీఐలు కూడా హాజరుకాకపోవడం గమనార్హం. ఎస్సై లేదా ఏఎస్సై స్థాయి అధికారి మాత్రమే మొక్కబడిగా హాజరవుతున్నారు. దాంతో కలెక్టరేట్‌కు వచ్చే పోలీస్‌ సమస్యలు పరిష్కారం కావడం లేదు.

ఆయా స్టేషన్లకు బదిలీ

జిల్లా పీజీఆర్‌ఎస్‌లో ప్రతి సోమవారం పది నుంచి 15 ఫిర్యాదులు పోలీసు కేసులకు సంబంధించి వస్తున్నాయి. మండల స్థాయిలో పోలీసులు పట్టించుకోవడం లేదని మహిళలు అనేక కేసుల విషయంపై కలెక్టరేట్‌కు జరిగే పీజీఆర్‌ఎస్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. అయితే ఇక్కడ వాటిని పరిష్కరించే పోలీసు అధికారి లేకపోవడంతో ఆ ఫిర్యాదులను తిరిగి ఆయా స్టేషన్లకు బదిలీ చేస్తున్నారు.

గత ప్రభుత్వంలో క్రమం తప్పకుండా హాజరు

గత ప్రభుత్వంలో కలెక్టరేట్‌లో జరిగే స్పందన కార్యక్రమానికి భీమవరం డీఎస్పీ క్రమం తప్పకుండా హాజరయ్యేవారు. పోలీసు కేసుకు సంబంధించి వచ్చే ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించేశారు. పై అధికారి స్థాయిలో ఉన్న సమస్యలను ఎస్పీ స్పందనకు బదిలీ చేసేవారు. దాంతో జిల్లా నలుమలూల నుంచి వచ్చే ప్రజలకు సంబంధించిన పోలీసు కేసుల సమస్యలు పరిష్కారమయ్యేవి. ఇప్పటికై నా కలెక్టర్‌ నాగరాణి ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించి డీఎస్పీ స్థాయి అధికారిని పీజీఆర్‌ఎస్‌కు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement