పచ్చ నేతల రేషన్‌ మాఫియా | - | Sakshi
Sakshi News home page

పచ్చ నేతల రేషన్‌ మాఫియా

May 12 2026 12:44 AM | Updated on May 12 2026 12:44 AM

నాకు ప్రాణహాని ఉంది: సాయికృష్ణ

సాక్షి ప్రతినిధి, ఏలూరు: పచ్చ రేషన్‌ మాఫియా పేట్రేగిపోతుంది.. రేషన్‌ బియ్యానికి టార్గెట్లు నిర్ణయించి గ్రామాల్లో సేకరించి రెట్టింపు ధరకు అమ్ముతున్నారు. ఈ అక్రమ వ్యవహారాన్ని అడ్డుకోకుండా ప్రజాప్రతినిధులు మొదలుకొని పోలీసుల వరకు అందరికీ నెలవారీ మామూళ్లు అందుతున్నాయి. రేషన్‌ బియ్యం మాఫియా వ్యవహారంలో ఏం జరిగిందో గాని టీడీపీ నేతలు రేషన్‌ మాఫియా ముసుగులో చేస్తున్న దందాను టీడీపీ కార్యకర్తే ఆధారాలతో సహా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.

జిల్లాలో రేషన్‌ మాఫియా తారాస్థాయిలో కొనసాగుతుంది. సివిల్‌ సప్లయ్స్‌, విజిలెన్స్‌, లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు, ప్రజాప్రతినిధులు ఇలా అందరికీ నెలవారీ రేట్‌ సెట్‌ చేసి కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తారాస్థాయిలో దందా సాగిస్తున్నారు. ప్రతి నెల ఒకటి నుంచి 10 వరకు జిల్లాలో రేషన్‌ పంపిణీ చేస్తారు. రేషన్‌ డీలర్ల వద్ద మిగిలిన బియ్యం, కార్డుదారులకు ఇచ్చిన బియ్యాన్ని తిరిగి డీలర్లే కిలో రూ.12 నుంచి రూ.15 వరకు కొనుగోలు చేస్తారు. ప్రతి ఊరిలో రేషన్‌ బియ్యం కొనుగోలు చేసే కొందరు వ్యక్తులు ఉంటారు. అందరి నుంచి ప్రతి నెల రేషన్‌ మాఫియా బియ్యాన్ని పోగుచేస్తుంది. ప్రధానంగా జిల్లాలో అధికార పార్టీ అండదండలతో పెద్దిరెడ్డి రామచంద్రరావు రేషన్‌ దందా సాగిస్తుంటారు. స్థానికంగా మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా సేకరించి పాలిషింగ్‌ పట్టి వాటిని కిలో రూ.30 నుంచి రూ.40 ధరకు కాకినాడ పోర్టు ద్వారా ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేసి భారీగా గడిస్తున్నారు. ఈ క్రమంలో చాట్రాయి మండలానికి చెందిన వంగర సాయిదత్తు రేషన్‌ బియ్యం వ్యాపారం చేస్తుంటారు.

నెలకు రూ.10 లక్షల మామూలు

గతంలో ఇతనిపై చాట్రాయి, తడికలపూడితో పాటు అనేక చోట్ల పోలీసు కేసులు ఉన్నాయి. ఈ క్రమంలో దత్తు చింతలపూడి, లింగపాలెం మండలాల నుంచి నెలకు 600 టన్నుల బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి రెట్టింపు ధరకు విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో రెండు మండలాల్లో రేషన్‌ దందాకు పోలీసులు మొదలుకుని ఎవరూ అడ్డురాకుండా ఉండటానికి లింగపాలెం మండలం టీడీపీ అధ్యక్షుడు, చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్‌ వ్యవహారాలు చక్కపెట్టే వ్యక్తిగా పేరున్న చలపతిరావు నెలకు రూ.10 లక్షలు మాములు ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిణామాల క్రమంలో లింగపాలెం మండలం మఠంగూడెంకు చెందిన టీడీపీ కార్యకర్త గంటా సాయికృష్ణ జిల్లా ఎస్పీకి సోమవారం ఫిర్యాదు చేశారు. చలపతికి లక్షల్లో నగదు సాయిదత్తు నుంచి అందుతుందని, కావాలంటే చలపతి బ్యాంకు ఖాతాలను పరిశీలించాలని, ధర్మాజీగూడెం ఎస్సై వెంకన్నబాబుకు రేషన్‌ దందా గురించి ఫిర్యాదు చేస్తే పట్టించుకోకపోగా తనకే వార్నింగ్‌ ఇచ్చారని పూర్తి స్థాయి విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

జిల్లా నుంచి కాకినాడ పోర్టుకు బియ్యం

ఒక్కొక్క మండలం నుంచి నెలకు 300 టన్నుల టార్గెట్‌

చింతలపూడి, లింగపాలెం మండలాల్లో నెలకు 600కు పైగా టన్నులు

మండల అధ్యక్షుడికి మాఫియా నుంచి నెలకు రూ.10 లక్షల మాముళ్లు

ధర్మాజీగూడెం ఎస్సై మొదలుకొని విజిలెన్స్‌ వరకు లంచాలు

ఏలూరు టౌన్‌: జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయం వద్ద గంట సాయికృష్ణ మాట్లాడుతూ.. ఈ అక్రమ దందాలో టీడీపీ లింగపాలెం మండల అధ్యక్షుడు గరిమెళ్ళ చలపతి, ధర్మాజీగూడెం ఎస్సైతోపాటు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది కుమ్మకై ్క యథేచ్ఛగా రేషన్‌ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారని తెలిపారు. ఇదే విషయాన్ని ప్రశ్నించాననే కక్షతో తనను అంతం చేయాలని... తన ఇంటివద్ద అక్రమ రేషన్‌ మాఫియాకు చెందిన వ్యక్తులు రెక్కీ చేశారని ఎస్పీకి అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బియ్యం దందాను అడ్డుకునే ప్రయత్నం చేశాననే కోపంతో తనకు బెదిరింపు కాల్స్‌ చేస్తున్నారని, రక్షణ కల్పించాలని ఎస్పీని కోరారు. పోలీస్‌ అధికారికి పీడీఎస్‌ దందాపై సమాచారం ఇవ్వగా... ‘అవేమన్నా డ్రగ్సా? రేషన్‌ బియ్యం రవాణా చేసుకుంటే నీకు వచ్చిన నష్టం ఏమిటి?’ అంటూ మాఫియాకు అనుకూలంగా మాట్లాడాడని, దీనిపై జోక్యం చేసుకోవద్దంటూ హెచ్చరించారని సాయికృష్ణ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement