భీమవరం (ప్రకాశంచౌక్): ప్రకృతి వైద్యుడు డాక్టర్ వేగిరాజు గోపాలరాజు సేవలు ఎనలేనివని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు అన్నారు. భీమవరం ప్రకృతి ఆశ్రమంలో సోమవారం డాక్టర్ వేగిరాజు గోపాలరాజు సంతాప సభ నిర్వహించారు. మోషేన్ రాజుతో పాటు డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ తాత, తల్లిందండ్రుల ఆశయాలు నిలబెడుతూ పేదలకు వైద్యం అందించిన ప్రకృతి వైద్యులు గోపాలరాజు అని అన్నారు. తానూ నమ్ముకున్న సిద్దాంతం కోసం గ్రామాన్ని వదలకుండా తాత, తండ్రి అందించిన ప్రకృతి ఆశ్రమంలోనే వైద్య సేవలు అందించిన గోపాలరాజు చిరస్మరణీయులన్నారు. కంతేటి వెంకటరాజు, చెరుకువాడ రంగసాయి, వేగిరాజు రామకృష్ణంరాజు, వేగిరాజు శివవర్మ, మూర్తి తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి ఉపాలయమైన స్థానిక పసరుకోనేరు వద్ద ఉన్న శ్రీ అభయాంజనేయుడి ఆలయంలో హనుమద్ జయంతి వేడుకలు సోమవారం నేత్రపర్వంగా జరిగాయి. ముందుగా సిబ్బంది ఆలయాన్ని సుగంధ భరిత పుష్పమాలికలు, మామిడి తోరణాలు, అరటి బోదెలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం అర్చకులు పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. తొలుత విశ్వక్సేనపూజ, పుణ్యహవచనను జరిపారు. ఆ తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ ఆంజనేయుడికి పంచామృత స్నపన, సహస్ర నామార్చన నిర్వహించారు. స్వామివారికి హారతులిచ్చి, నివేదన సమర్పించారు. అనంతరం భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
కాళ్ల: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం సాలిపేటకు చెందిన వావిలాల శ్రీనివాసులు యూకేలో తన సామాజిక సేవలకు గుర్తింపుగా బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో నిర్వహించిన ప్రతిష్టాత్మక కింగ్ గార్డెన్ పార్టీకి ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు. గత 20 ఏళ్లుగా యుకేలో ఉంటున్న ఆయన భారతీయ, స్థానిక సమాజాల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ఇది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు అని, బ్రిటిష్ రాజ కుటుంబం నుంచి వ్యక్తిగత ఆహ్వానం అందుకోవడం చాలా అరుదైన విషయం ఆనందం వ్యక్తం చేశారు.
తణుకు అర్బన్: బెంగళూరులో నిర్వహించిన జాతీయ స్థాయి స్టేట్ లెజిస్లేటివ్ లీడర్‌షిప్ వర్క్‌షాపులో ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ పాల్గొన్నారు. రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం జరిగింది. 14 రాష్ట్రాల నుంచి దాదాపు 40 మంది హాజరైన ఈ సదస్సులో.. విద్యా విధానంలో మార్పులు, ప్రజా ఆరోగ్య వ్యవస్థలోని సమస్యలు, బడ్జెట్ నిర్వహణ వంటి కీలక అంశాలపై చర్చించినట్లు వివరించారు.


