ఉపాధ్యాయులపై అదనపు భారం వద్దు | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయులపై అదనపు భారం వద్దు

May 12 2026 12:44 AM | Updated on May 12 2026 12:44 AM

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వేసవి సెలవుల సమయంలో ఉపాధ్యాయులపై అధిక భారం మోపకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఫ్యాప్టో ఏలూరు జిల్లా నాయకులు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.వెంకటలక్ష్మమ్మను సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో నాయకులు మాట్లాడుతూ స్కూల్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌, మ్యాబిటేషన్‌ ప్లాన్‌, క్లస్టర్‌ స్కూల్‌ కాంప్లెక్స్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌, మండల ప్లాన్‌ తదితర కార్యక్రమాలు, ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌ పేరుతో వేసవి సెలవుల సమయంలో కూడా ఉపాధ్యాయులను నిరంతరం విధుల్లో నిమగ్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే 10వ తరగతి ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ అదనపు బాధ్యతల మధ్య మళ్లీ వివిధ అభివృద్ధి ప్రణాళికల తయారీ పనులను అప్పగించడం వలన ఉపాధ్యాయులపై తీవ్రమైన మానసిక, శారీరక ఒత్తిడి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో తీవ్రమైన ఎండలు, అధిక ఉష్ణోగ్రతలు నేపథ్యంలో పలువురు ఉపాధ్యాయులు వడదెబ్బలకు గురై అనారోగ్యానికి లోనవుతున్నారన్నారు. వేసవి సెలవుల సమయంలో ఉపాధ్యాయులపై వివిధ రకాల పనుల పేరుతో అదనపు భారం మోపకుండా చూడాలని, ఇప్పటికే నిర్వహిస్తున్న 10వ తరగతి ప్రత్యేక తరగతులను దృష్టిలో ఉంచుకొని ఇతర పనులలో సడలింపులు ఇవ్వాలని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో ఫ్యాప్టో చైర్మన్‌ జీ.మోహన్‌, సెక్రటరీ జనరల్‌ ఆదినారాయణ, కో–చైర్మన్‌ జీ. వెంకటేశ్వరరావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ ఆర్‌.రవికుమార్‌, జీ వెంకటరమణ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement