రహదారి భద్రతపై చింతలపూడి పోలీసుల ప్రత్యేక చర్యలు
చింతలపూడి: ఏలూరు జిల్లాలోని గ్రీన్‌ఫీల్డ్ హైవే (ఎన్‌హెచ్–365 బీజే) పై రహదారి ప్రమాదాల నివారణకు జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టింది. సోమవారం రేచర్ల గ్రామం వద్ద గ్రీన్‌ఫీల్డ్ హైవేను సందర్శించిన ఎస్సై సతీష్ కుమార్, అక్కడ ఉన్న అంబులెన్స్ డ్రైవర్లు, రహదారి భద్రతా సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘అతివేగం వద్దు – ప్రాణం ముద్దు’ అనే నినాదంతో వాహనదారులు ప్రయాణించాలని సూచించారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్ సిబ్బంది ఎంత త్వరగా స్పందించాలి, రహదారి నిబంధనలు ఎలా పాటించాలి అనే అంశాలపై దిశానిర్దేశం చేశారు. హైవేపై వాహనాలను అక్రమంగా నిలిపి ఉంచకుండా పెట్రోలింగ్ వాహనాలు నిరంతరం నిఘా ఉంచాలని ఆయన ఆదేశించారు. రోడ్డు పక్కన ఆపిన వాహనాలను తొలగించడం ద్వారా, వెనుక నుంచి వచ్చే వాహనాలు ఢీకొనే ప్రమాదాలను అరికట్టవచ్చని తెలిపారు. సాంకేతిక కారణాలతో ఆగిపోయిన వాహనాలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించి, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూస్తున్నట్లు వివరించారు.
నిబంధనలు పాటించాలి : ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలని చింతలపూడి ఎస్సై కె.సతీష్ కుమార్ అన్నారు. రాత్రిపూట ప్రయాణించే వారు మరింత అప్రమత్తంగా ఉండాలని, పోలీసులు తీసుకునే భద్రతా చర్యలకు సహకరించాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని, క్షేత్రస్థాయి పెట్రోలింగ్‌ను సమన్వయం చేస్తూ ప్రమాద రహిత గ్రీన్‌ఫీల్డ్ హైవేగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు.


