రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి

May 8 2026 11:14 AM | Updated on May 8 2026 11:14 AM

రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి ఆలయాల అభివృద్ధికి ప్రణాళికలు న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శిగా శ్రీలక్ష్మి బిల్లుల మంజూరులో జాప్యాన్ని నివారించండి

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన ‘వన్‌ మంత్‌, వన్‌ విలేజ్‌, 4 విజిట్స్‌’ కార్యక్రమాన్ని ప్రజలు, రైతులు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్‌ కలెక్టరు ఎంజే అభిషేక్‌ గౌడ కోరారు. గురువారం ఆయన అధ్యక్షతన స్థానిక శనివారపుపేట–1 స్వర్ణవార్డు సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. గ్రామ ప్రజలు, రైతులు కార్యాల యాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. సమావేశంలో జిల్లా స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు అధికారి జీ. వెంకట నాయుడు, తహసీల్దార్‌ కే గాయత్రీదేవి, వివిధ శాఖల అధికారులు, స్వర్ణవార్డు ఉద్యోగులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

కొయ్యలగూడెం: దేవదాయ శాఖ ద్వారా పలు గ్రామాల్లో ధూప దీప నైవేద్యాలు (డీడీఎన్‌ పథకం) అందించే ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి కె.శ్రీనివాస్‌ పేర్కొన్నారు. కొయ్యలగూడెంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించారు. అలాగే గ్రామ దేవత శ్రీ చింతాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద వివరాలు సేకరించారు. బుట్టాయిగూడెం మండలంలోని పులిరామన్నగూడెం రోడ్డులో ఉన్న సూదికొండ మావుళ్ళమ్మ ఆలయానికి కూడా అభివృద్ధి ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు. ఎండోమెంట్‌ ఈవో శ్రీలక్ష్మి, ఏఈ భాను సిబ్బంది పాల్గొన్నారు.

ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నూతన కార్యదర్శిగా ఎన్‌.శ్రీలక్ష్మి గురు వారం బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా పనిచేసిన ఆమెను హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఏలూరు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా నియమించారు. ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన కె.రత్నప్రసాద్‌ మొదటి అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జిగా రాజమహేంద్రవరం బదిలీపై వెళ్లారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉపాధ్యాయుల మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లుల మంజూరులో జాప్యాన్ని తక్షణం నివారించాలని జిల్లా సర్వజన ఆసుపత్రి ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌ అచ్యుత రామయ్యను పీఆర్‌టీయూ నాయకులు కోరారు. ఈ మేరకు గురువారం ఆసుపత్రిలో ఆయన్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కేన్సర్‌, గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించి పెట్టుకున్న వైద్య ఖర్చుల బిల్లులు సకాలంలో అందక ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారన్నారు. కొందరికి సంబంధించి ఏడాది కాలం గడిచినా మంజూరుకు నోచుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పెండింగ్‌లో ఉన్న మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ ఫైళ్లన్నీ తక్షణం పర్యవేక్షించి వెంటనే మంజూరు చేసే విధంగా కృషి చేయాలని కోరారు. సూపరింటెండెంట్‌ను కలిసిన వారిలో పీఆర్‌టీయూ ఏలూరు జిల్లా అధ్యక్షుడు పువ్వుల ఆంజనేయులు, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ఎల్‌వీ చలం ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement