హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్
కై కలూరు: న్యాయవాదులు కక్షిదారులకు సత్వర న్యాయం అందిస్తూ న్యాయస్థానాల గౌరవాన్ని మరింత ఇనుమడింప చేయాలని హైకోర్టు న్యాయమూర్తి, కృష్ణా జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ చెప్పారు. కై కలూరులో 1వ అదనపు సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్), జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టును ఆయన బుధవారం ప్రారంభించారు. ముందుగా జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ పోలీసు గౌరవవందనాన్ని స్వీకరించారు. అనంతరం కై కలూరులోని హోటల్‌లో బార్ అసోషియేషన్ అధ్యక్షుడు గురజాడ ఉదయశంకర్ ఆధ్వర్యంలో న్యాయవాదులతో సమావేశంలో పాల్గొన్నారు. జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ మాట్లాడుతూ యువ న్యాయవాదులు మరింత నైపుణ్యాన్ని పెంపొదించుకోవాలన్నారు. రాష్ట్రంలో నూతన కోర్టులు మొత్తం 94 మంజూరవగా కృష్ణా జిల్లాకు 10 కేటాయించారన్నారు. వీటిలో ఇప్పటికి 7 కోర్టులను ప్రారంభించామన్నారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ వేణుతిరుమల్లి గోపాలకృష్ణారావు, జస్టిస్ మండవ కిరణ్మయి న్యాయవాదులకు పలు విషయాలను వివరించారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ జడ్జి గుట్టల గోపి, గుడివాడ న్యాయస్థానాల న్యాయమూర్తులు వాసుదేవరావు, గాయత్రీ, అరుంధతి, కుముదిని, కై కలూరు సీనియర్, జూనియర్ జడ్జిలు వీవీఎన్‌వీ.లక్ష్మీ, ఎం.శివకిరణ్ పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, ఇన్‌చార్జి ఆర్డీవో ముక్కోటి, ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


