సిలిండర్ల పంపిణీలో కొరత రాకూడదు | - | Sakshi
Sakshi News home page

సిలిండర్ల పంపిణీలో కొరత రాకూడదు

May 7 2026 8:14 AM | Updated on May 7 2026 8:14 AM

సిలిండర్ల పంపిణీలో కొరత రాకూడదు సమస్యల పరిష్కారం కోసం గ్రామ సభలు సైబర్‌ నేరాలపై అప్రమత్తం

ఏలూరు (టూటౌన్‌): ప్రజలకు ఇబ్బందులు కలగకుండా గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ, సంబంధిత సమస్యలపై అధికారులు, గ్యాస్‌ ఏజెన్సీ ప్రతినిధులతో జాయింట్‌ కలెక్టరు అభిషేక్‌ గౌడ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సిలిండర్ల పంపిణీ జరగాలని, ఎక్కడా ఫిర్యాదు వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ–కేవైసీ ప్రక్రియను వేగవంతం చేయాలని, సిలిండరు డెలివరీలు తప్పనిసరిగా ఓటీపీ విధానంలోనే నిర్వహించాలని అన్నారు. డెలివరీ సిబ్బంది అదనపు రుసుం వసూలు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ప్రజలతో మర్యాద పూర్వకంగా ప్రవర్తించాలని సూచించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి ఇ.బాబు విలియమ్స్‌, అసిస్టెంటు సప్లయ్‌ ఆఫీసరు వై.ప్రతాప్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు (టూటౌన్‌): జిల్లాలో ‘వన్‌ మంత్‌... వన్‌ విలేజ్‌... 4 విజిట్స్‌’ కార్యక్రమాన్ని ప్రతి నెల ఒక గ్రామంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని రెవిన్యూ అధికారులను కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి బుధవారం కార్యక్రమం నిర్వహణపై రెవిన్యూ అధికారులకు టెలి కాన్ఫరెన్స్‌ ద్వారా దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రధానంగా రెవెన్యూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం తహసీల్దార్లు తమ పరిధిలోని గ్రామాల్లో వారానికి ఒక రోజు చొప్పున 4 రోజుల పాటు గ్రామ సభలు నిర్వహించి, ఆ గ్రామంలో సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలన్నారు. ఈ నెల 7 నుంచి ప్రతి మండలంలోనూ ఒక గ్రామంలో ప్రారంభం కావాలన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ ఎం.జె. అభిషేక్‌ గౌడ, ఇంచార్జ్‌ డీఆర్‌ఓ దేవకీదేవి, సబ్‌ కలెక్టర్‌ బొల్లిపల్లి వినూత్న, ఆర్డీఓలు పాల్గొన్నారు.

తాడేపల్లిగూడెం: సైబర్‌ మోసాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పెదవేగి డీపీటీసీ చీఫ్‌ లా ఇన్‌స్ట్రక్టర్‌ ఆకుల రఘు కోరారు. ఏపీ నిట్‌లో బుధవారం సైబర్‌ జాగరూక్త దివస్‌ కార్యక్రమం నిర్వహించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మోసాలకు పాల్పడుతున్నారన్నారు. సెల్‌ఫోన్లకు వచ్చే లింకులను క్లిక్‌ చేయవద్దన్నారు. పొరపాటున చేస్తే బ్యాంకు ఖాతాలలో సొమ్ములు, విలువైన డేటాను చోరీ చేస్తున్నారన్నారు. మోసాలకు అవకాశం ఇవ్వకుండా ఎవ్వరికి వారే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement