కొయ్యలగూడెం: ఆరుగాలం శ్రమించిన అన్నదాతలకు కష్టకాలం కొనసాగుతోందని రైతుల నోట్లో కూటమి ప్రభుత్వం దుమ్ము కొట్టిందని మాజీ ఎమ్మెల్యే పోలవరం నియోజకవర్గం ఇన్‌చార్జి తెల్లం బాలరాజు పేర్కొన్నారు. బుధవారం ఆయన నియోజకవర్గ పరిశీలకులు శివాజీరాజుతో కలిసి పొంగుటూరు, చొప్పరామన్నగూడెం గ్రామాలలోని మొక్కజొన్న రైతుల బాధలను అడిగి తెలుసుకున్నారు. గిట్టుబాటు ధర లేక మొక్కజొన్న పంటను కళ్ళాలలో పోసి ఆవేదన చెందుతున్న రైతులను పరామర్శించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.2400 మద్దతు ధర లభించగా ఇప్పుడు రూ.2000 కూడా లభించడం లేదన్నారు. ప్రస్తుత పరిస్థితులలో మొక్కజొన్న రైతులకు రూ.4000 మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించి కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వర్జీనియా పొగాకు కొనుగోళ్ళు ఆశాజనకంగా లేని సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి మార్క్‌ఫెడ్ సంస్థను ప్రవేశపెట్టి మద్దతు ధర లభించేలా కృషి చేశారన్నారు. అన్ని పంటలకు మద్దతు ధర లభించే వరకు పార్టీ శ్రేణులు అలుపెరుగని పోరాటం చేస్తాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మండల కన్వీనర్ తుమ్మలపల్లి గంగరాజు, పార్టీ నాయకులు గంటా శ్రీనివాస్, గొడ్డటి నాగేశ్వరరావు, పసుపులేటి రాంబాబు, గంజిమాల రామారావు, నూకల రాము, గేలం శ్రీను, గేలం వెంకటేశ్వరరావు, రాఘవరాజు సాయి, బిరుదుగడ్ల ప్రేమ్‌కుమార్, దండాబత్తుల ఖగన్, దూలపల్లి కాంతారావు తదితరులు పాల్గొన్నారు.


