పాలకొల్లు సెంట్రల్: గ్రామాభివృద్ధి ముసుగులో చెరువు మట్టిని అమ్ముకుంటే సహించేది లేదని వైఎస్సార్ సీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌చార్జి గుడాల గోపి హెచ్చరించారు. పాలకొల్లు మండలం వెలివెల గ్రామంలోని పశువుల చెరువు గట్లు బలహీనంగా ఉన్నాయని, వాటిని ఆధునికీకరిస్తున్నామని మాయమాటలు చెప్పి అధికార పార్టీ నాయకులు మట్టిని విక్రయించి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. అక్రమాలను అడ్డుకున్న మీడియా ప్రతినిధులపై అధికార పార్టీ నాయకులు దుర్భాషలాడటం, వారి కుటుంబ సభ్యులను విమర్శించడం అత్యంత దారుణమని ఆయన మండిపడ్డారు. సుమారు 5.22 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ చెరువును సర్వే చేసి, అన్యాక్రాంతమైన గట్టు భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామ ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు ఐక్యంగా పోరాడి కోర్టును ఆశ్రయించడంతోనే ఈ మట్టి దందాకు బ్రేక్ పడిందని గోపి తెలిపారు. కోర్టు ఉత్తర్వులు వచ్చేలోపే చెరువు చుట్టూ ఉన్న సుమారు 150 కొబ్బరి చెట్లను తొలగించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ తవ్వకాలు జరుగుతున్నంత సేపు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి, కోర్టు ఆదేశాలు వచ్చాక స్పందించడం విచారకరమన్నారు.


