చింతలపూడి: మొక్కజొన్న పంటను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 2,400 మద్దతు ధరతో ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, సీపీఐ ఆధ్వర్యంలో చింతలపూడి మండలం రేచర్ల గ్రామంలో ఏలూరు–సత్తుపల్లి ప్రధాన రహదారిపై మంగళవారం రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రబీలో సాగైన మొక్కజొన్న చేతికి వస్తున్నా, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం శోచనీయమన్నారు. ప్రైవేటు వ్యాపారులు సిండికేట్‌గా మారి క్వింటాకు రూ.1,700 లోపు ధరకే కొనుగోలు చేస్తుండటంతో రైతులు క్వింటాకు రూ. 700 వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మద్దతు ధరతో కొనుగోలు చేయాలని, ఇప్పటికే నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 20 వేల పరిహారం చెల్లించాలని కోరారు. ప్రైవేటు వ్యాపారులు మద్దతు ధర కంటే తక్కువకు కొనకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం రైతులు తహశీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్ షకీలా బేగంకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు తొర్లపాటి బాబు, దొంత కృష్ణ, కంచర్ల గురవయ్య, తక్కెళ్ళపాటి ప్రసాద్ రావు, ఎస్కే మస్తాన్, మార్త అమ్ములు, రేచర్ల గ్రామ శాఖ కార్యదర్శి ఇస్తరాకుల వెంకటేశ్వరరావు రైతులు పాల్గొన్నారు.


