ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యార్థి దశ నుంచే విద్యతో పాటు క్రీడలు, వృత్తి నైపుణ్యం వైపు విద్యార్థులు అడుగులు వేయాలని కలెక్టర్ కే.వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో మంగళవారం 2025–26 విద్యా సంవత్సరానికి అత్యధిక మార్కులు సాధించిన 34 మంది విద్యార్థులకు కలెక్టరు ప్రతిభా పురస్కారాలు అందజేసి, పలకరించి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో రాష్ట్రానికి, మన జిల్లాకు మంచి గుర్తింపు తెచ్చేది విద్య, క్రీడలు మాత్రమేనని యువత ఆలోచనలు చేసి, అడుగులు వేయాలన్నారు. ప్రతి విద్యార్థి అంకిత భావంతో, ప్రణాళికా బద్ధంగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. విద్యార్థుల విజయానికి ఉపాధ్యాయులు చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. వెనుకబడిన విద్యార్థులను కూడా ముందుకు తీసుకురావడంలో ప్రభుత్వ పాఠశాలలు విశేష కృషి చేస్తున్నాయని తెలిపారు. డీఈవో ఎం.వెంకటలక్ష్మమ్మ, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ వై.విశ్వమోహన్ రెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతులు సంక్షేమ శాఖ డీడీ ఆర్‌వీ నాగరాణి, సమగ్రశిక్ష ఏపీసీ కే.పంకజ్ కుమార్, డీసీఓ ఎన్.భారతి, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


