ఉంగుటూరు: మండలంలోని బాదంపూడి మత్స్య శిక్షణ కేంద్రంలో శిక్షణకు యువకులు కరువయ్యారు. ఔత్సాహికులైన అభ్యర్థులకు ఇక్కడ మత్స్య శిక్షణ ఇస్తారు. ఇది ప్రభుత్వ మత్స్య శాఖ ద్వారా నడుస్తోంది. ఈ శిక్షణ కేంద్రంలో స్టైఫండులో 20 మందికి, నాన్ స్టైఫండుతో 20 మందికి శిక్షణ ఇచ్చేవారు. మూడు నెలలు శిక్షణ కోర్సులో శిక్షణ పాందేందుకు గతంలో యువకులు పోటీ పడేవారు. అయితే మత్స్య శిక్షణ పొందేందుకు అభ్యర్థులు కరువు అయ్యారు. కనీసం 20 మంది కూడా రావడం లేదు. ఇన్ ల్యాండు ఫిషరీస్ ట్రైనింగ్ పొందిన వారికి మూడునెలలు సర్టిఫికెటు ఇస్తారు. ఈ సర్టిఫికెటుతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఫీల్డ్ మెన్ ఉద్యోగాలు వచ్చేవి అయితే ఇటీవల కాలంలో ఈ శిక్షణకు ఆదరణ తక్కువైంది. ప్రభుత్వం కూడా శిక్షణ గురించి యువతకు అవగాహన కల్పించడం లేదు. దీంతో ఎంతో ప్రాచుర్యం ఉన్న మత్స్య శిక్షణ కేంద్రం నిరుపయోగంగా మారుతుంది.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 8న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి పీవీ రమేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ జాబ్ మేళాలో రాయల్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అండ్ పేటీఎం కంపెనీలు పాల్గొంటాయని పేర్కొన్నారు. 20 నుండి 35 సంవత్సరాల లోపు ఉన్న పదో తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యార్హత ఉన్న యువతను సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, టీం లీడర్ పోస్టులకు ఎంపిక చేస్తారని వివరించారు. అభ్యర్థులు ఫార్మల్ డ్రెస్ కోడ్‌లో హాజరుకావాలని, అవసరమైన డాక్యుమెంట్స్, రెజ్యూమ్ తీసుకురావాలని సూచించారు. మరిన్ని 88868 82032, 74161 18388 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.


