కలగా ఫిషింగ్‌ హార్బర్‌ | - | Sakshi
Sakshi News home page

కలగా ఫిషింగ్‌ హార్బర్‌

May 4 2026 7:43 AM | Updated on May 4 2026 7:43 AM

హార్బర్‌ నిర్మాణం పూర్తి చేయించాలి

హార్బర్‌ నిర్మాణంతో ఎగుమతులు పెరిగే చాన్స్‌

నరసాపురం: సుదీర్ఘ తీరప్రాంతం ఉన్న నరసాపురంలో దశాబ్దాల కలగా ఉన్న ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా కూటమి ప్రభుత్వం కీలకమైన ఈ ప్రాజెక్టుపై ఉలుకూ పలుకూ లేకుండా ఉంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసిన ఈ ప్రాజెక్టుపై చంద్రబాబు సర్కార్‌ నిర్లక్ష్యం చూపించడంతో మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మొత్తం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అభివృద్ధికి సంబంధించిన ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించకపోవడానికి కారణాలు ఏమిటో ప్రభుత్వం చెప్పాలనే డిమాండ్లు ప్రజల నుంచి వస్తున్నాయి. ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రాజెక్టు ఊసే లేకపోవడంతో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం కలేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో నరసాపురం మండలం బియ్యపుతిప్ప వద్ద ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి పూనుకున్నారు. 2024 ఎన్నికలకు ముందే టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. ఉమ్మడి పశ్చిమ జిల్లా అభివృద్ధిలో గీటురాయిగా, మొత్తం గోదావరి జిల్లాలకు మణిహారంగా నరసాపురంలో మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణ పనులను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టింది. బియ్యపుతిప్పలో మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి 2022 మే నెలలో ఏపీ మారిటైమ్‌ బోర్డు టెండర్లు పిలవగా, విశ్వసముద్ర సంస్థ పనులు దక్కించుకుంది. అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపించడంతో ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులతో పాటు ఇతర సాంకేతిక అనుమతులు కూడా వెంటనే తెప్పించారు. రూ. 429.43 కోట్ల వ్యయంతో నిర్మించే హార్బర్‌కు సంబంధించిన ప్రాథమిక పనులు 2023 ఫిబ్రవరిలో ప్రారంభమయ్యాయి.

మత్స్యకారులను నమ్మించి మోసం

అయితే చంద్రబాబు సర్కార్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హార్బర్‌ అంశం మూలనపడింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసిన ఈ ప్రాజెక్టు పనులను పట్టాలెక్కించడంలో కూటమి సర్కార్‌ నిర్లక్ష్యానికి కారణాలు ఏమిటనే అంశం ఎవరికీ అర్థంకాకుండా ఉండటం గమనార్హం. పనులు దక్కించుకున్న విశ్వసముద్ర సంస్థ ఎన్నికలకు ముందు ప్రాథమిక సర్వే వంటి పనులు చేసింది. చంద్రబాబు గద్దెనెక్కిన తర్వాత సదరు సంస్థ పనులు చేపట్టేందుకు వెనకడుగు వేసింది. 19 కిలోమీటర్ల సముద్ర తీరప్రాంతం ఉన్న నరసాపురంలో బియ్యపుతిప్ప ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మించాలనే డిమాండ్‌ దశాబ్దాలుగా ఉంది. ఈ ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న మత్స్యకారుల ఓట్లు దండుకోవడానికి ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మించి తీరుతామని ఎన్నో ప్రకటనలు గుప్పించారు. నిర్మాణానికి అన్నీ గత ప్రభుత్వం సిద్ధం చేసినా కూడా ప్రస్తుత చంద్రబాబు సర్కార్‌ పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

బియ్యపుతిప్ప ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మించాలని దశాబ్దాలుగా మత్స్యకారులు కోరుతున్నారు. నరసాపురంలో హార్బర్‌ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం ఖర్చు భరించేలా మా హయాంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం చేశారు. పర్యావరణ అనుమతులతో పాటు ఇతర అన్ని సాంకేతిక అనుమతులు వచ్చేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. టెండర్లు పిలిచి, పనులు విశ్వసముద్ర సంస్థకు అప్పగించాం. పనులు ప్రాథమికంగా ప్రారంభమయ్యాయి కూడా. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం పనులు ఎందుకు మొదలు పెట్టించడంలేదనేది అర్థం కావడం లేదు. –ముదునూరి ప్రసాదరాజు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

మత్స్య సంపద, ఆక్వా ఎగుమతుల్లో ఉమ్మడి పశ్చిమ జిల్లాకు రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ నుంచి దేశ, విదేశాలకు భారీగా ఆక్వా ఎగుమతులు జరుగుతుంటాయి. రొయ్యలు, చేపల సాగు పెరగడంతో ఆక్వా రంగం గడిచిన మూడు దశాబ్దాల కాలంలో బాగా పుంజుకుంది. ఏటా కోట్లాది రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆక్వా ద్వారా జిల్లా నుంచి ప్రభుత్వానికి వస్తోంది. మరోవైపు తీరప్రాంతంలో సముద్ర మత్స్య సంపద ద్వారా కూడా భారీగా ఆదాయం సమకూరుతుంది. ఏటా నరసాపురం తీరంలో రూ. 300 కోట్ల విలువ చేసే మత్స్య ఎగుమతులు సాగుతాయి. కానీ హార్బర్‌ లాంటి మౌలిక వసతులు ఉంటే మరో 40 శాతం ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. ఈ కారణంతోనే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హార్బర్‌ నిర్మాణానికి పూనుకుంది. బియ్యపుతిప్ప వద్ద ఫిషింగ్‌ హార్బర్‌ను 600 ఎకరాల విస్తీర్ణంలో రూ. 429.43 కోట్ల భారీ వ్యయంతో నిర్మించ తలపెట్టి పనులు మొదలుపెట్టింది. హార్బర్‌కు సమీపంలోని 216 జాతీయ రహదారిని అనుసంధానం చేయడం, మరోవైపు పక్కనే ఉన్న మచిలీపట్నంలో కూడా హార్బర్‌ పనులు చేపట్టడం గత ప్రభుత్వం చేసింది. ఇంత ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాజెక్టుపై ఇప్పటికై నా రాష్ట్ర సర్కార్‌ స్పందించాలనే డిమాండ్లు జిల్లా వాసుల నుంచి వస్తున్నాయి.

చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిర్మాణానికి గ్రహణం

రూ 429.43 కోట్లతో నిర్మాణానికి శ్రీకారం చుట్టిన జగన్‌ సర్కార్‌

టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసిన గత ప్రభుత్వం

Advertisement
 
Advertisement
Advertisement