భీమవరం (ప్రకాశం చౌక్): పేద, మధ్యతరగతి కుటుంబానికి చెందిన యజమాని చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి అమలు చేసే బీమా పథకాన్ని ఈ కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పేదల బీమా పథకం గురించి ఊసే ఎత్తడం లేదు. గత రెండేళ్లుగా బీమా క్లయిమ్స్‌పై పైసా ఖర్చు చేయలేదు. దాంతో కుటుంబంలో సంపాదించే వ్యక్తిని కోల్పోయిన కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. పేదవాడి కుటుంబానికి బీమా చెల్లించడానికి నిధులు లేవని సాకు చూపిస్తున్న చంద్రబాబు, యోగా కోసం ఒక రోజుకు రూ.300 కోట్లు ఖర్చు చేశారు. ప్రమాదవశాత్తు చనిపోతే రూ.5 లక్షల బీమాను నామినీగా ఉన్న లబ్ధిదారులకు అందించాల్సి ఉంది. పోస్టుమార్టం రిపోర్ట్, పోలీసు నివేదికలు ఇలా అన్ని అర్హత పత్రాలు సిద్ధంగా ఉన్నప్పటికీ, అర్హులైన వారికి బీమా అందడం లేదు. శ్రీచంద్రన్న బీమాశ్రీగా పేరు మార్చి, ప్రమాదవశాత్తూ మరణించిన వారికి ఇచ్చే సాయాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటివరకూ ఆ పథకం ఊసే ఎత్తడం లేదు. పేదలను ఆదుకునే బీమా పథకాన్ని నిలిపివేయడం దారుణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో 1500 మంది వరకు..
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండేళ్లలో ప్రమాదవశాత్తు, సహజంగా మరణించి బీమా పథకానికి అర్హులైన వారు ఉమ్మడి జిల్లాలో సుమారు 1500 మంది వరకు ఉన్నారు. వీరిలో ప్రమాదవశాత్తు చనిపోయిన వారు 600 మంది ఉండగా, సహజ మరణం పొందిన వారు మరో 600 మంది ఉన్నారు. అలాగే ప్రమాదాల్లో శాశ్వత లేదా పాక్షిక అంగవైకల్యం పొందిన వారు 300 మంది వరకు ఉన్నారు. వీరంతా బీమా పథకం ద్వారా ఆర్థిక సాయం అందుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం బీమా కోసం ఆన్‌లైన్ దరఖాస్తు చేయడానికి కూడా అవకాశం లేకపోవడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
గత ప్రభుత్వంలో..
రూ. 5 లక్షల బీమా చెల్లింపు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం శ్రీవైఎస్సార్ బీమాశ్రీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసింది. 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల లోపు వారు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5 లక్షలు, 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల లోపు వారు సహజ మరణం పొందితే రూ.లక్ష అందించేవారు. అలాగే శాశ్వత అంగవైకల్యానికి రూ.5 లక్షలు, పాక్షిక అంగవైకల్యానికి రూ.2.50 లక్షల బీమా సొమ్మును చెల్లించేవారు. దీంతో బాధిత కుటుంబాల బతుకుదెరువు సాఫీగా సాగేది. ఎవరైనా వ్యక్తి చనిపోయారని తెలిసిన వెంటనే సచివాలయ సిబ్బంది బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి వెంటనే బీమా క్లయిమ్ కోసం ఆన్‌లైన్ చేసేవారు. దరఖాస్తు చేసిన 21 రోజుల్లోనే నామినీ బ్యాంకు ఖాతాలో బీమా సొమ్ము జమ అయ్యేది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఏడాదికి సగటున రూ. 10 కోట్లు బీమా కోసం ప్రభుత్వం ఖర్చు చేసేది.
కూటమి ప్రభుత్వంలో
నిలిచిపోయిన చెల్లింపులు
రెండేళ్లుగా పైసా చెల్లింపు చేయని వైనం
ఉమ్మడి జిల్లాలో రెండేళ్లలో ప్రమాదాల్లో చనిపోయిన వారు 600 మంది
సహజ మరణం పొంది అర్హత
కలిగిన వారు 600 మంది
బీమా కోసం ఎదురుచూపులు
గత ప్రభుత్వంలో (2023–24) బీమా చెల్లింపులు:
పశ్చిమగోదావరి జిల్లా
వివిధ ప్రమాదాల్లో మరణించిన వారు 50 మంది కాగా, వారికి రూ. 2.50 కోట్ల బీమా చెల్లింపు..
అర్హత కలిగి సహజ మరణం పొందిన 300 మందికి రూ.3 కోట్ల ఆర్థిక సాయం
ఏలూరు జిల్లా
ప్రమాదవశాత్తూ మరణించిన వారు 45 మందికి రూ.2.25 కోట్లు
సహజ మరణం పొందిన 381 మందికి రూ.3.81 కోట్ల బీమా సొమ్ము చెల్లింపు
కూటమి ప్రభుత్వంలో రెండేళ్ల బీమా చెల్లింపులు:
ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో ప్రమాదవశాత్తు చనిపోయిన 600 మందికి, సహజ మరణం పొందిన 600 మందికి బీమా చెల్లింపులు సున్నా


