బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం కామవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రత్యేక బస్సుల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అధికంగా తరలివచ్చిన భక్తుల వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ వారితోపాటు పోలీసులు కూడా బందోబస్తు నిర్వహించారు.
కుక్కునూరు: మండలంలోని వేలేరు గ్రామ సమీపంలో ఆదివారం రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కుక్కునూరు ఎస్సై రాజారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం గుండాలపాడు గ్రామానికి చెందిన మడకం కన్నారావు (28) తన బైక్‌పై వేలేరు మీదుగా భద్రాచలం వెళ్తుండగా, ఎదురుగా మరో బైక్‌పై వచ్చిన వెంకటాపురం గ్రామానికి చెందిన కొండ చిట్టిబాబు ఆటోను ఓవర్‌టేక్ చేస్తున్న క్రమంలో కన్నారావు బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో రోడ్డుపై పడిపోయిన కన్నారావు తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం కామవరం సమీపంలోని గుబ్బల మంగమ్మ తల్లి గుడి సమీపంలో కింగ్ కోబ్రా (గిరినాగు) సంచరిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు కోర్స రాంబాబు, కోర్స గంగరాజులు తెలిపారు. ఆదివారం సాయంత్రం వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేట మండలం కావిడగుండ్ల, ఏపీలోని బుట్టాయగూడెం మండలం సరిహద్దు అటవీ ప్రాంతంలో, గుడికి అత్యంత సమీపంలో నీటి కుంట వద్దకు ఈ పాము వచ్చి నీరు తాగి వెళ్తుండగా కొందరు యువకులు చూసినట్లు తెలిపారు. ఆ యువకులు తమ సెల్‌ఫోన్‌లో వీడియో కూడా తీశారు. సుమారు 18 అడుగుల పొడవు ఉన్న ఈ గిరినాగు జంతువుల రక్తం వాసనకు గుడి పరిసర ప్రాంతాల్లో తిరిగే అవకాశం ఉన్నందున, భక్తులతో పాటు పరిసర ప్రాంత ప్రజలు అడవిలోకి వెళ్లవద్దని సూచించారు. అటవీ శాఖ అధికారులు కూడా ప్రజలను హెచ్చరిస్తున్నారు. గతంలో ఇదే ప్రాంతం నుంచి పెద్ద పులి బుట్టాయగూడెం మండలంలోకి ప్రవేశించిన విషయాన్ని వారు గుర్తు చేశారు.
చాట్రాయి: భూ సమస్య పరిష్కరించాలంటూ బాధితుడు వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపాడు. బాధితుడి వాంగ్మూలం ప్రకారం.. మర్లపాలెం గ్రామానికి చెందిన వాసం సత్యం 40 ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన వెల్ది నాభూషణం, భూషయ్యల దగ్గర 6 సెంట్లు భూమి కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆ భూమిలోనే 40 ఏళ్లుగా సత్యం కొడుకు వాసం రమేష్ కుటుంబం నివాసం ఉంటున్నారు. ఆదివారం భూమి అమ్మిన వారి వారసులు వేగుంట రామకృష్ణ, వంశీకృష్ణలు తమ ఇంటిని ఆక్రమించుకోవడానికి పోలీసులు, రెవెన్యూ సిబ్బందిని తీసుకుని కొలతలు కొలుస్తుండగా తట్టుకోలేక, రమేష్ తన పిల్లలతో కలిసి వాటర్ ట్యాంకు ఎక్కాడు. సమస్య పరిష్కరించకపోతే దూకి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో ఎస్‌ఐ డి. రామకృష్ణ ఇరువర్గాల వద్ద ఉన్న డాక్యుమెంట్లు తీసుకుని, సోమవారం నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు కిందకు దిగారు.
భీమడోలు: యువతిని మానసిక, శారీరకంగా వేధిస్తున్న యువకుడిపై భీమడోలు పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పూళ్ల పంచాయతీలోని ఎంఎం పురంలో ఓ యువతి బీఎస్సీ కంప్యూటర్ చదివి ఇంట్లో ఉంటోంది. అదే గ్రామానికి చెందిన జగదీష్‌కుమార్ పరిచమయ్యాడు. ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి కుదిరింది. సహించని జగదీష్ కొంత కాలంగా ఆమెను వేధిస్తున్నాడు. గత నెల 28వ ఇంట్లోకి చొరబడి ఆత్యాచార యత్నాన్ని ప్రయత్నించాడు. ఆ యువతి కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఆమెతో కలిసి ఉన్న ఫొటోలను ఆమె కుటుంబ సభ్యులతో పాటు వివాహాం చేసుకునే బంధువులకు పంపుతూ బెదిరిస్తున్నాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు భీమడోలు ఎస్సై ఎస్‌కే మదీనా బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


