పెండింగ్‌ భూ సమస్యల కేసులు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ భూ సమస్యల కేసులు పరిష్కరించాలి

May 3 2026 7:41 AM | Updated on May 3 2026 7:41 AM

పెండింగ్‌ భూ సమస్యల కేసులు పరిష్కరించాలి

నూజివీడు: పట్టణంలోని పేదలకు నివేశన స్థలాలను పంపిణీ చేసేందుకు 2019–24 కాలంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సేకరించిన భూములకు సంబంధించి కోర్టుల్లో ఉన్న పెండింగ్‌ కేసులను త్వరతగతిన పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు సబ్‌ కలెక్టర్‌ బొల్లిపల్లి వినూత్నను కోరారు. స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో శనివారం ప్రతాప్‌ అప్పారావు సబ్‌కలెక్టర్‌ను కలిసి పలు విషయాలు చర్చించారు. పట్టణంలోని ఇళ్లు లేని పేదలందరికీ నివేశన స్థలాలు ఇచ్చి సొంతింటి కలను నిజం చేసేందుకు పట్టణ పరిధిలో ఉన్న సీలింగ్‌ భూములను, చేతులు మారిన అసైన్‌మెంట్‌ భూములను తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సేకరించారని, దీనిపై కొందరు కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకున్నారన్నారు. దాదాపు 45 ఎకరాలకు సంబంధించి కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులకు సంబంధించి వివరాలను కోర్టుకు సమర్పించి క్లియర్‌ చేస్తే వందలాది మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు మార్గం సుమగం అవుతుందన్నారు. సబ్‌కలెక్టర్‌ స్పందిస్తూ కోర్టు కేసులకు సంబంధించి పూర్తి వివరాలు తెప్పించుకుని కేసులను క్లియర్‌ చేస్తానని పేర్కొన్నారు. ట్రిపుల్‌ ఐటీ సమీపంలోని జగనన్న లే అవుట్‌లో స్థానికులు మంచినీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే మున్సిపల్‌ అధికారులను పంపించి మంచినీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రతాప్‌ అప్పారావు కోరగా సానుకూలంగా స్పందించి నీటి సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement