లిక్కర్ పాలసీకి తూట్లు
400కు పైగా బెల్టు షాపులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: దెందులూరులో మద్యం దందా పరాకాష్టకు చేరింది. పగలూ రాత్రి సంబంధం లేకుండా 24 గంటలూ మద్యం అందుబాటులో ఉంటుంది. నియోజకవర్గంలో బెల్టు షాపు లేని గ్రామమే లేదు. క్వార్టర్‌కు రూ.30 నుంచి రూ.60 వరకు అధికంగా వసూలు చేస్తూ దోపిడీకి తెరతీశారు. ఎకై ్సజ్, పోలీస్ శాఖ మాముళ్ల మత్తులో అధికార పార్టీకి దాసో హమనే రీతిలో వ్యవహరిస్తున్నారు. దీంతో నియోజకవర్గ నేత రింగ్ లీడర్‌గా మారడంతో సర్వం ఆయన కనుసన్నల్లో నడుస్తోంది. ఈ వ్యవహారంపై టీడీపీ నేత శనివారం తీవ్ర ఆరోపణలు గుప్పించడం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
సాయి బాలాజీ కేరాఫ్..
దెందులూరు నియోజకవర్గంలో 20 మద్యం దుకాణాలు కేటాయించారు. దీనికి సంబంధించి 2024లో టెండర్లు ఆహ్వానిస్తే అధికార పార్టీ కీలకనేత ఎకై ్సజ్ కార్యాలయం వద్ద వీధి గుండాలను పెట్టి మరీ దాష్టికం చేయడంతో ఎవరూ టెండర్లు దాఖలు చేయలేదు. చివరిలో బయట ప్రాంత వ్యక్తులకు నలుగురికి ఈ నియోజకవర్గంలో షాపులు దక్కితే వారిపై దాష్టికం చేసి తన దారికి తెచ్చుకున్నారు. నియోజకవర్గంలో ప్రస్తుతానికి అధికారికంగా 17 షాపులున్నాయి. 17 వైన్ షాపుల లైసెన్స్‌ల పేర్లు గాని, ఏ షాపు ఎంత వరకు విక్రయిస్తుంది.. షాపు నిర్వాహకులు ఎవరనేది ఎవరికీ తెలియదు. తెలిసిందల్లా 17 షాపులు సాయి బాలాజీ వైన్స్‌వే. ఈ షాపులన్నీ మొత్తం సిండికేట్ చేసి అధికార పార్టీ కీలక నేతే సాయిబాలాజీ పేరిట వైన్‌షాపు దందా నిర్వహిస్తున్నారు. మద్యం షాపుల్లో రూ.10 ఎక్కువకు అమ్ముతున్నారు. బెల్టు షాపుల్లో రూ. 30 నుంచి రూ.60 వరకూ అధికంగా దోచుకుంటున్నారు. 2024లో ఇతర జిల్లాలకు చెందిన వ్యక్తి మద్యం దుకాణం దక్కించుకుంటే షాపు పెట్టడానికి వీల్లేకుండా నానా హంగామా చేశారు. చివరికి నిర్వాహకుడు టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత ఈడ్పుగంటి శ్రీనివాసరావు సహకారంతో 7వ మైలురాయి వద్ద కంటైనర్ ఏర్పాటు చేసి షాపు పెడితే 2వ రోజే పొక్లెయిన్‌తో షాపు మాయం చేశారు. దీనికి సహకరించిన టీడీపీ నేత శ్రీనివాసరావు, అతని తండ్రి వెంకటేశ్వరరావుపై దొంగతనం కేసు నమోదు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది.
కూటమి ప్రభుత్వం రూపొందించిన లిక్కర్ పాలసీకి టీడీపీ కీలక నేత తూట్లు పొడిచి దెందులూరు నియోజకవర్గంలో పార్టీని నాశనం చేస్తున్నారని టీడీపీ నేత, న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసరావు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. రెండేళ్ళుగా అరాచకం సాగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో తాను మాట్లాడుతున్నానని, నియోజకవర్గంలో మద్యం దందాను అరికట్టడానికి తాను పోరాటం మొదలుపెట్టానని, తనపై ఎలాంటి దాష్టికాలకు పాల్పడినా అన్నింటికి ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
కీలక నేత కనుసన్నల్లోనే మద్యం సిండికేట్
17 లైసెన్సులు సాయి బాలాజీ పేరిటే
నియోజకవర్గంలో 400కు పైగా బెల్టు షాపులు
ఎమ్మార్పీ కంటే రూ.30 నుంచి రూ.60 వరకు అధికంగా క్వార్టర్‌పై వసూలు
తీవ్ర ఆరోపణలు చేసిన టీడీపీ నేత ఈడ్పుగంటి
నియోజకవర్గంలో మద్యం దందా ఏ స్ధాయిలో సాగుతుందో వివరిస్తూ శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. క్వార్టర్ బాటిల్(చీప్) రూ.30, మీడియం బ్రాండ్ రూ.50, కొద్దిగా నాణ్యమైన బ్రాండ్‌కు రూ.60 అదనంగా వసూలు చేసి విక్రయిస్తున్నారు. నాణ్యమైన మద్యం తక్కువ ధరకు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో అధికార పార్టీ నేతలే బెల్టుషాపుల నిర్వాహకులుగా వ్యవహరించడం, బెల్టు షాపుల్లోని ప్రతి క్వార్టర్ సీసా సాయిబాలాజీ నుంచే కొనుగోలు చేయడం, అడ్డగోలుగా, సమయ పాలనతో సంబంధం లేకపోవడం, అత్యధిక ధరకు విక్రయించడం, మందు బాబులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం, ఇలా అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన కొనసాగుతోంది. ప్రజా ప్రతినిధి సొంత దందా కావడంతో ఎకై ్సజ్ అధికారులు నాలుగు మండలాల్లో కన్నెత్తి చూడలేని పరిస్థితి. దీన్ని సాకుగా చూపి ఎకై ్సజ్ అధికారులు పూర్తిగా నియోజకవర్గంలో జరిగే మద్యం విక్రయాల అవకతవకలు గాలికి వదిలేయడం చర్చనీయాంశంగా మారింది. పోలీసుల సైతం ఇదే రీతిలో వ్యవహరించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. నియోజకవర్గంలో రోజుకు సగటున రూ.30 లక్షలు, నెలకు రూ.5 కోట్ల మేర విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం. సంక్రాంతి లాంటి పండగ వస్తే మూడు రోజుల్లోనే రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల విక్రయాలు సాగుతున్నాయి.


