వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి కరెంట్‌ కట్‌ | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి కరెంట్‌ కట్‌

May 3 2026 7:41 AM | Updated on May 3 2026 7:41 AM

వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి కరెంట్‌ కట్‌

రాజకీయ కక్షతోనే..

హైకోర్టు ఆదేశాలు బేఖాతరు

రాజకీయ కక్షతోనే అంటున్న వైఎస్సార్‌సీపీ వర్గాలు

ఏలూరు టౌన్‌: వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయానికి విద్యుత్‌ సరఫరా కట్‌ చేసి... కూటమి సర్కారు కనుసన్నల్లో అధికారులు తమ కక్ష పూరిత చర్యలను అమలు చేశారు. ప్రభుత్వ నిబంధనలు పాటించినా కుట్ర పూరిత రాజకీయాలతో విషం చిమ్ముతున్నారు. ఏలూరు ఏఎస్‌ఆర్‌ స్టేడియం, పెద్ద రైల్వేస్టేషన్‌ ఎదురుగా నిర్మించిన వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయ భవనానికి శనివారం విద్యుత్‌ శాఖ అధికారులు విద్యుత్‌ సరఫరాను నిలిపివేయడంపై పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీలకు ఏమాత్రం సంబంధం లేని ఒక సంఘం ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తే.. నగర కమిషనర్‌ హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ విద్యుత్‌ శాఖ అధికారులకు చెప్పి సరఫరా నిలిపివేయించారు.

కోర్టు ఆదేశాలు పట్టించుకోరా ? ఏలూరు జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయం భవనంపై రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రిట్‌ పిటిషన్‌ 22124/ 2025లో.. నాట్‌ టూ టేక్‌ ఎనీ కోయిర్‌సివ్‌ స్టెప్‌ అండర్‌ కన్‌స్ట్రక్షన్‌ ఆఫ్‌ వైఎస్సార్‌సీపీ బిల్డింగ్‌ అంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు భవనాన్ని సీజ్‌ చేయటం, డిమాలిష్‌ చేయటం వంటివి చేయకూడదని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఏపీఈపీడీసీఎల్‌ నుంచి అధికారికంగా విద్యుత్‌ సరఫరా కనెక్షన్‌ తీసుకోవడంతోపాటు ప్రతి నెలా విద్యుత్‌ బిల్‌ చెల్లిస్తున్నారు. ప్రెసిడెంట్‌, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ పేరుతో వీటిని కొనసాగిస్తున్నారు. ఏప్రిల్‌ 10న రూ.525 బిల్లును పార్టీ ప్రతినిధులు చెల్లించిన రసీదు ఉంది. ఈ నేపథ్యంలో బీ.ఆర్‌.అంబేద్కర్‌ కొల్లేరు గ్రామ షెడ్యూల్‌ కులాల సంఘం పేరుతో ఏలూరు నగర కమిషనర్‌కు ఫిర్యాదు చేయటంతో కమిషనర్‌ ఆదేశాలతో విద్యుత్‌ శాఖ పవర్‌కట్‌ చేసినట్లు చెబుతున్నారు. ఇంతకీ వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణానికి అనుమతులపై సరైన అవగాహన లేకుండానే ఫిర్యాదు చేయటం.. దాన్ని ఆసరాగా చేసుకుంటూ కమిషనర్‌ కక్షపూరిత చర్యలకు చేపట్టడంపై పార్టీ నేతలు మండిపడుతున్నారు.

ఇడా అనుమతులు తీసుకున్నాకే..

ఇడా అనుమతులతోనే ఏలూరులో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఇడా బిల్డింగ్‌ ప్లాన్‌ ఆర్డర్‌లో స్పష్టంగా భవన నిర్మాణాన్ని 2030 జూన్‌ 25 లోపు నిర్మించుకోవాలని చెప్పింది. ఏలూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఆథారిటీకి వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణ ప్లాన్‌ అప్రూవల్‌ కోసం రూ.12.45 లక్షల నగదును చెల్లించింది. ఈ సొమ్మును ఇడాకు 2024 జూన్‌ 25న వైఎస్సార్‌సీపీ చెల్లించిందనే విషయం నగర కమిషనర్‌కు తెలియకపోవటం విడ్డూరంగా ఉందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

ఏలూరులోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణం పూర్తి చేసుకోవడానికి ఇడా అనుమతులు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనల మేరకు సొమ్ములు చెల్లించాం. జిల్లా కార్యాలయ భవనంపై రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు సైతం కమిషనర్‌ పట్టించుకోకపోవటం దారుణం. ఇడా పర్మిట్‌ నెంబర్‌ 1075/0173/బీ/ఈఎల్‌ఈ/ఆర్‌ఏఐఎల్‌ఎస్‌టీఏ/2023 పేరుతో 2024 జూన్‌ 25న భవన నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది. భవన నిర్మాణాన్ని 2025 డిసెంబర్‌ 25లోపు ప్రారంభించి, 2030 జూన్‌ 25 లోపు పూర్తి చేయాలని ఆర్డర్‌లో పొందుపరిచారు. ఇవన్నీ నగర కమిషనర్‌కు తెలియవా?. దీనిపై మేము చట్టం ప్రకారం పోరాటం చేసేందుకు సిద్దంగా ఉన్నాం.

– ప్రత్తిపాటి తంబి, వైఎస్సార్‌సీపీ ఏలూరు లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు

Advertisement
 
Advertisement
Advertisement