● అవగాహన లేని భక్తులకు తప్పని ఇక్కట్లు
● కేశఖండన శాల వద్ద కౌంటర్లు చాలక తోపులాటలు
ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రంలో శనివారం భక్తులకు ఆన్‌లైన్ కష్టాలు ఎదురయ్యాయి. శనివారం కావడం, పదో తరగతి పరీక్షా ఫలితాలు వెలువడటంతో క్షేత్రానికి తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి ఎక్కువైంది. దాంతో కేశఖండనశాల వద్ద ఉన్న కియోస్క్ మెషిన్, ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ కౌంటర్లు చాలక భక్తులు ఇక్కట్లుకు గురయ్యారు. ఒకానొక దశలో కౌంటర్ల వద్ద భక్తులు తోపులాడుకున్నారు. టికెట్ కూలైన్లలో భక్తులు గంటల తరబడి బారులు తీరారు. మహిళా భక్తులు కేశఖండనశాల బయట పడిగాపులు పడ్డారు. పరిస్థితిని గమనించిన ఆలయ అధికారులు వెంటనే క్యాష్ కౌంటర్‌ను ఓపెన్ చేసి, నగదు లావాదేవీలను ప్రారంభించి, త్వరితగతిన టికెట్లను జారీ చేశారు. దాంతో పరిస్థితి సద్దుమణిగింది.
పెద్దల పరిస్థితి అగమ్య గోచరం
ముఖ్యంగా శనివారం క్షేత్రానికి వచ్చే భక్తుల్లో అధిక శాతం మంది గ్రామీణ ప్రాంతాల వారే ఉంటారు. అందులో నిరక్షరాస్యులైన పెద్దవారి వద్ద ఆండ్రయిడ్ ఫోన్లు ఉండవు. దాంతో వారికి ఫోన్‌పే, గూగుల్ పేలు గురించి తెలియవు. అలాంటి పరిస్థితుల్లో పూర్తిగా నగదు రహిత లావాదేవీలు వల్ల పెద్దవారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటోంది. శనివారం కొందరు పెద్దవారు కేశఖండన టికెట్ల కోసం నానా పాట్లు పడ్డారు. యువకుల వద్దకు వెళ్లి డబ్బులిచ్చి, తమకు టికెట్లు బుక్‌చేసి పెట్టమని ప్రాధేయపడ్డారు. ఆలయాల్లో పూర్తిగా నగదు రహిత లావాదేవీలు జరపడం సాధ్యం కాదని పలువురు భక్తులు అంటున్నారు.
కౌంటర్లు పెంచాలి
క్షేత్రానికి వచ్చిన వెంటనే భక్తులు ముందుగా కేశఖండన శాలకు వెళ్లి, అక్కడ మొక్కులు తీర్చుకున్న తరువాత ఆలయానికి వెళతారు. కాబట్టి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే కేశఖండన శాల వద్ద ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ కౌంటర్లను, కియోస్క్ మెషిన్‌లను మరింతగా పెంచాలని భక్తులు కోరుతున్నారు. కియోస్క్ మెషిన్‌లో భక్తుడి పేరు, ఫోన్ నెంబర్, ఇతర వివరాలను ఎంటర్ చేసి, ఓకే చేసి, స్కానర్ ద్వారా నగదు చెల్లిస్తున్నారు. ఆ తరువాత దాదాపు 20 సెకన్లకు గానీ టికెట్ రావడం లేదు. దాంతో మెషిన్ వద్ద భక్తుల రద్దీ పెరిగిపోతోంది.
వాట్సప్ గవర్నెన్స్‌తో ఇక్కట్లు :
మన మిత్ర యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు కేశఖండన శాల సిబ్బందికి ఫోన్‌లో వాటిని చూపారు. వివరాలను నమోదు చేసుకున్న సిబ్బంది వారికి టికెట్ల స్థానంలో ప్రత్యేకంగా స్లిప్పులను జారీ చేశారు. ఆ తరువాత సిబ్బంది మన మిత్ర యాప్‌లోని టికెట్లను ప్రింట్ తీసుకోవడానికి నానా పాట్లు పడ్డారు.
రద్దయిన సేవా టికెట్లు జారీ
ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అన్ని ఆర్జిత సేవలను, నిత్యార్జిత కల్యాణాలను రద్దు చేశారు. అయితే కియోస్క్ మెషిన్‌లలో అష్టోత్తర సేవా టికెట్లను తొలగిచలేదు. దాంతో రద్దయిన విషయం తెలియక కొందరు భక్తులు కియోస్క్‌ల ద్వారా అష్టోత్తర సేవా టికెట్లను పొందారు. వాటిని తీసుకుని ఆలయానికి వెళ్లిన భక్తులకు అక్కడ చుక్కెదురైంది. అష్టోత్తరం సేవ లేదని అధికారులు వారిని నిలిపివేశారు. కొద్దిసేపటి తరువాత ఆ టికెట్లపై స్వామివారి దర్శనానికి అనుమతించారు.


