ఏలూరు టౌన్: ఏలూరు మాదేపల్లి రోడ్డు హేలాపురి టౌన్‌షిప్ వెనుక ఖాళీ స్థలంలో ఏడు రోజుల క్రితం వ్యక్తిని రాళ్ళతో కొట్టి చంపిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ హత్యకేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ట్రైనీ ఐపీఎస్ జయశర్మ, డీఎస్పీ శ్రావణ్‌కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. ఏప్రిల్ 25న రాత్రి వేళ రాయి నూకరాజును రాళ్ళతో కొట్టి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై ఏలూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. వన్‌టౌన్ సీఐ సత్యనారాయణ, రూరల్ ఇన్‌చార్జి ఎస్‌ఐ నాగబాబు, ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. శనివారం ఏలూరు రూరల్ పరిధిలోని నోవా కళాశాల సమీపంలో కొందరు వ్యక్తులు అనుమానస్పదంగా ఉన్నట్లు పోలీసులకు అందిన సమాచారంతో వెళ్ళి వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. నూకరాజును హత్య చేసిన వారిగా గుర్తించారు. ఈ హత్యలో ప్రధాన నిందితుడు మహంకాళి సత్తిబాబు అలియాస్ సత్తిపండు, నక్కా ఏసురత్నం అలియాస్ లక్ష్మణ్, గుమ్మళ్ళ సాయి అలియాస్ స్టైలిష్ సాయి, కొల్లి అనిల్ అలియాస్ మున్నా, కొట్టు ప్రశాంత్‌కుమార్, గెడ్డం బ్రహ్మనందరావును అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి స్కూటర్, బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సత్తిపండుపై 12కేసులు ఉన్నాయని, అనకాపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అధికంగా కేసులు ఉన్నాయని డీఎస్పీ తెలిపారు. ఏ2 నిందితుడిపై ఏలూరులో కేసులు ఉన్నాయనీ ప్రతీ ఒక్కరిపై నిఘా మరింత పెంచామని స్పష్టం చేశారు. ఏ6 నిందితుడు బ్రహ్మానందరావుపై కేసులు ఉన్నాయని, ప్రస్తుతం అతను బెయిల్‌పై ఉన్నాడని తెలిపారు.


