ఏ పంటకు ఎంత మోతాదులో..
చింతలపూడి: అధిక దిగుబడుల కోసం రైతులు విచక్షణారహితంగా రసాయన మందులు, పురుగు మందులు వాడటంతో భూములు నిర్జీవంగా మారుతున్నాయి. సూక్ష్మ జీవులు నశించడం వల్ల వాటి ద్వారా లభించే సేంద్రియ పదార్థాలు, సూక్ష్మ పోషక పదార్థాలు నేలలో అదృశ్య మవుతున్నాయి. దీని వల్ల మొక్కల్లో పెరుగుదల నశిస్తుంది. ఉద్యాన పంటల్లో సమగ్ర పోషక యాజమాన్యాన్ని రైతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు. ముఖ్యంగా ఉద్యాన పంటల్లో 50 శాతం సేంద్రియ ఎరువులు, 50 శాతం రసాయన ఎరువులు వాడితే నాణ్యమైన దిగుబడులు పొందవచ్చనని ఉద్యానశాఖ అధికారిణి ఎండీ షాఫియా ఫర్హీన్ సూచిస్తున్నారు.
సేంద్రియ ఎరువులంటే..
సేంద్రియ ఎరువుల్లో పశువుల ఎరువు, మేకలు, గొర్రెల ఎరువు, వర్మి కంపోస్ట్‌తో పాటు కోళ్ళ పెంట ప్రముఖమైనవి. వీటిల్లో మొక్కలకు కావాల్సిన అన్నిరకాల ప్రధాన పోషకాలు, సూక్ష్మ పోషకాలైన జింక్ మెగ్నీషియం, మాంగనీస్, బోరాన్ తదితర పోషకాలు దొరుకుతాయి. తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు లభించే ఏకై క సేంద్రియ ఎరువు కోళ్ల ఎరువు మాత్రమే. కోళ్ల ఎరువులో ఎక్కువ మొత్తంలో నత్రజని 3 శాతం, భాస్వరం 2.5 శాతం, పొటాష్ 1.2 శాతం ఉంటాయి. ఉద్యాన పంటలైన కూరగాయల పంటలకు ఎకరానికి 500 కేజీల కోళ్ల ఎరువు సరిపోతుంది. ఈ ఎరువును రసాయన ఎరువుతో కలిపి వాడితే 20 నుండి 25 శాతం నత్రజని ఆదా చేయవచ్చు. కోళ్ళ ఎరువును వివిధ ఉద్యాన పంటల్లో ఈ మోతాదులో వినియోగిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు.
పచ్చి కోళ్ల ఎరువు వద్దు
పచ్చి కోళ్ల ఎరువును ఎట్టి పరిస్ధితుల్లోను మొక్కలకు వేయకూడదు. దానిలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల వేరు వ్యవస్థ మాడిపోయి మొక్కలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అందుకే కోళ్ళ ఎరువును సేకరించాక బాగా మాగిన తరువాత మొక్కలకు వేసుకోవాలి. టన్ను కోళ్ల ఎరువుకు 15 కేజీల సూపర్ ఫాస్ఫేట్ కలిపితే తొందరగా కుళ్ళిపోతుంది. కోళ్ళ ఎరువును సాధారణంగా మొక్కలు నాటడానికి 20 రోజుల ముందుగా వేయాలి.
పామాయిల్ తోటలకు – 6 ఏళ్ల వయస్సున్న చెట్టుకు 50 కేజీలు
కొబ్బరి – 8 సంవత్సరాల వయస్సున్న
కాపుకాసే చెట్టుకు 30 నుంచి 50 కేజీలు
అరటి – ఎకరానికి 5 టన్నులు
మామిడి – 10 ఏళ్ళ కాపు కాసే చెట్టుకు 50 నుంచి 70 కేజీలు
జీడి మామిడి – 7 ఏళ్ల వయసున్న కాపు కాసే చెట్టుకు 40 కేజీలు
నిమ్మ, బత్తాయి – 6 ఏళ్ల వయసున్న కాపు కాసే చెట్లకు 30 కేజీలు
బొప్పాయి – ఎకరానికి 3 నుంచి 5 టన్నులు
మిరప – ఎకరానికి 3 టన్నులు
పూల తోటలకు – ఎకరానికి 2 టన్నులు


