నాణేలతో శ్రీవారి విగ్రహం | - | Sakshi
Sakshi News home page

నాణేలతో శ్రీవారి విగ్రహం

May 2 2026 7:56 AM | Updated on May 2 2026 7:56 AM

నాణేలతో శ్రీవారి విగ్రహం బుద్ధుడి బోధనలపై విద్యార్థులకు పోటీలు పోగొట్టుకున్న పర్సు అందజేత ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ తనిఖీలు దాడి చేసిన వ్యక్తి అరెస్టు

ద్వారకాతిరుమల: కొందరు భక్తులు వినూత్నంగా చిల్లర నాణేలతో శ్రీవారి విగ్రహాన్ని తయారు చేయించి తమ భక్తిని చాటారు. విగ్రహ తయారీకి రూ.1.65 లక్షలు ఖర్చు చేశారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం దొండపూడికి చెందిన కొందరు భక్తులు చిల్లర నాణేలతో అదే గ్రామానికి చెందిన యర్రంశెట్టి రామకృష్ణతో శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తయారు చేయించారు. ఈ విగ్రహ తయారీకి రూ.10, రూ.5, రూ.2, రూ.1 చిల్లర నాణేలను వినియోగించారు. వెండితో తయారు చేసిన యజ్ఞోపవీతం, నామం, కళ్లు, ముక్కు, నోరు, గెడ్డం విగ్రహానికి అమర్చారు. విగ్రహాన్ని శుక్రవారం క్షేత్రానికి ఊరేగింపుగా తీసుకొచ్చి, కల్యాణకట్ట వద్ద ఏర్పాటుచేశారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 12వ శతాబ్దం వరకూ ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల్లో బౌద్ధమతానికి సంబంధించిన ఆనవాళ్లు లభించాయని పురావస్తు శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కే.తిమ్మరాజు తెలిపారు. బుద్ధ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర పురావస్తు, ప్రదర్శన శాలల శాఖ ఏలూరు మ్యూజియం, బుద్ధ సొసైటీ ఆఫ్‌ ఇండియా, గుత్తా చిత్తరంజన్‌ దాస్‌, శ్రీకృష్ణ భారతీమణి చారిటబుల్‌ ట్రస్ట్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఏలూరు పురావస్తు ప్రదర్శన శాలలో శుక్రవారం విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. బుద్ధుడి జీవిత విశేషాలు, బోధనలను నేటి తరం విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్ధేశంతో ఈ పోటీలు నిర్వహించామని తెలిపారు. బుద్ధిస్ట్‌ స్కాలర్‌ పీ భారతి, బుద్ధ సొసైటీ ఆఫ్‌ ఇండియా ఏలూరు మాజీ అధ్యక్షురాలు ఆర్‌.మణి సుందర్‌ సింగ్‌, భారతీమణి ట్రస్ట్‌ ప్రెసిడెంట్‌ కే.అమరవాణి తదితరులు పాల్గొన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): రాజమహేంద్రవరం ఆర్టీసీ బస్సులో గురువారం ప్రయాణిస్తూ మహిళా ప్రయాణికురాలు పర్సు పోగొట్టుకుంది. పర్సును గుర్తించిన సర్వీసు కండక్టర్‌ పీఎస్‌ నారాయణ భద్రంగా తీసుకొచ్చి భీమవరం డిపో ఎర్నింగ్‌ సెక్షన్‌లో అప్పగించారు. ప్రయాణికురాలు పల్లేటి మార్త ఆధార్‌ కార్డు ఆధ్వారంగా ఏరియా తహసీల్దార్‌తో మాట్లాడి భర్త పల్లేటి ఏసును భీమవరం డిపోకు రప్పించి జిల్లా ప్రజా రవాణాధికారి ఎస్‌.గిరిధర్‌ కుమార్‌ సమక్షంలో అప్పగించారు. పర్సులో నగదుతో పాటు బంగారు, వెండి నగలు వస్తువులున్నాయి.

భీమవరం (ప్రకాశంచౌక్‌): భీమవరం జువ్వలపాలెం రోడ్డులోని కేఎఫ్‌సీలో శుక్రవారం ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్‌ ఏఎస్‌ఆర్‌ రెడ్డి తనిఖీలు నిర్వహించారు. నఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేఎఫ్‌సీలో ఆయిల్‌తో తయారు చేసిన ఆహార పదార్థాలు తింటే అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు. కేసు నమోదు చేసి ఆ ఆయిల్‌ ఉపయోగించిన చికెన్‌ ఫ్రై ఐటెంలను ఆహార పరీక్షల కోసం శాంపుల్స్‌ తీసుకుని స్టేట్‌ ఫుట్‌ ల్యాబ్‌కు పంపిచామన్నారు. చికెన్‌, ఇతర ఆహార పదార్థాలు నిలువఉంచే డీప్‌ ఫ్రిడ్జ్‌ ప్రాంతంలో అపరిశుభ్ర వాతావరణం ఉందని తెలిపారు.

చాట్రాయి: మహిళపై దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఇన్‌చార్జి ఎస్సై ఎం.చిరంజీవి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మండలంలోని సి.గుడిపాడు గ్రామానికి చెందిన నక్కా శ్రీనివాస్‌ ఏప్రిల్‌ 29న ఓ మహిళపై దాడి చేసి తప్పించుకున్నాడని ఆయన చెప్పాడు. విస్సన్నపేట బస్టాండ్‌ వద్ద తిరుగుతుండగా పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించడంతో అదుపులోకి తీసుకున్నట్లు ఆయన చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement