ప్రాణాలకు భరోసా | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలకు భరోసా

May 2 2026 7:56 AM | Updated on May 2 2026 7:56 AM

ప్రాణాలకు భరోసా

50 సార్లు రక్తదానం చేశాను

సేవే పరమావధిగా..

ఇంతవరకూ 15,000 మందికి రక్తదానం

హోప్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ కృషిపై ప్రశంసలు

కై కలూరు: ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేస్తూ మేమున్నాం అంటూ ఆశను కల్పిస్తున్నారు హోప్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ సభ్యులు. కై కలూరు నియోజకవర్గం కలిదిండి మండలం పడమటిపాలెం గ్రామానికి చెందిన అల్లాడి రవితేజ తన స్నేహితుడు బచ్చు నాగరాజుతో కలిసి 2022లో సంస్థను స్థాపించి ఓ వాట్సప్‌ గ్రూపు క్రియేట్‌ చేశాడు. ప్రస్తుతం గ్రూపులో 150 మంది సభ్యులు ఉన్నారు. వీరందరూ శ్రీఏ డ్రాఫ్‌ ఆఫ్‌ బ్లడ్‌ ఈజ్‌ హోప్‌ ఫర్‌ లైఫ్‌శ్రీ అనే నినాదంతో స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారు. ఒక్కరే 50 సార్లు రక్తదానం చేసిన రికార్డును కూడా సొంతం చేసుకున్నారు.

15,000 మందికి రక్తదానం

ఏలూరు, ఎన్టీఆర్‌, కృష్ణా, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలు, విశాఖపట్నం, కాకినాడ ఇలా అనేక జిల్లాల్లో రక్తం అవసరమైన వారికి హోప్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ సభ్యులు 15,000 మందికి పైగా రక్తదానం చేసి రికార్డు సృష్టించారు. రోడ్డు ప్రమాదాలు, గర్భిణులు, క్యాన్సర్‌ పేషెంట్లు, తలసేమియా చిన్నారులు, అత్యవసర చికిత్సలు ఇలా ఏదైన అర్థరాత్రి సైతం సుదూర ప్రాంతాలకు వెళ్ళి మరీ రక్తదానం చేశారు. ప్రధానంగా అల్లాడి రవితేజ, బచ్చు నాగరాజుకు తోడు నూకల శివ, చిన్నవరపు నాగార్జున తోడయ్యారు. వీరితో పాటు క్రియశీలకంగా లింగం పవన్‌కిషోర్‌, సబ్బారపు వినోద్‌, వక్కసల్లి గణి, ఈ.కృష్ణ, గంధం దుర్గాప్రసాద్‌, ప్రభాకర్‌ మాస్టార్‌, కట్టా సత్యనారాయణ, సమయం మురళీకృష్ణ, ఎస్పీ వివేకానంద, ఆటపాక ప్రసాద్‌, పనస సుబ్బు, పేటేటి రామాంజనేయులు, మేకల వెంకటేశ్వరరావు, ఉండి రాజశేఖరరెడ్డి వ్యహరిస్తున్నారు. వీరిలో గంధం దుర్గాప్రసాద్‌ 28 సార్లు రక్తదానం చేయడం విశేషం.

తలసేమియా చిన్నారులకు అండగా..

తలసేమియా చిన్నారులకు ప్రతి 21 రోజులకు రక్తం మార్చాలి ఉండగా.. భీమవరం, ఉండి, కై కలూరు, కలిదిండి, పాలకొల్లు, నరసాపురం తణుకు ఇలా అనేక ప్రాంతాల్లో మొత్తం 35 మంది చిన్నారులను గుర్తించారు. వీరికి క్రమం తప్పకుండా రక్తం అందిస్తున్నారు. ఉచిత మెడికల్‌ క్యాంపులు నిర్వహిస్తున్నారు. కోవిడ్‌ సమయంలోనూ ట్రస్ట్‌ సభ్యులు పలువురికి రక్తదానం చేశారు. ఆక్సిజన్‌ సిలిండర్లు అందించారు.

రక్తదానం చేయడంలో అనేక మందికి ఇప్పటికీ కొన్ని అపోహలు వెంటాడుతోన్నాయి. వాటిని ఎవరూ నమ్మవద్దు. నా బ్లడ్‌ గ్రూపు ఓ పాజిటివ్‌. నేను ఇప్పటికీ 50 సార్లు రక్తదానం చేశాను. ఇంకా చేస్తూనే ఉంటాను. హోప్‌ సంస్థ ద్వారా సేవ చేస్తున్నందుకు గర్వంగా ఉంది.

– తమ్మిరెడ్డి వెంకట అప్పారావు, ఉపాధ్యాయుడు, కై కలూరు

సకాలంలో రక్తం అందక ఓ నిండు గర్భిణి మరణించింది. దీంతో స్నేహితులతో కలసి హోప్‌ చారిటబుల్‌ ట్రస్టును స్థాపించాను. సంస్థ 6వ వార్షికోత్సవం జరుపుకుంది. సంస్థలో ప్రతి సభ్యుడు ఎవరికి రక్తం కావాలన్నా స్వచ్ఛందగా వెళ్తున్నారు. రానున్న రోజుల్లో సేవలను మరింత విస్తరిస్తాం.

– అల్లాడి రవితేజ, సంస్థ ఫౌండర్‌, పడమటిపాలెం

Advertisement
 
Advertisement
Advertisement