నూజివీడు: 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి నూజివీడు ట్రిపుల్ ఐటీకి చెందిన ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం విద్యార్థులు ప్రతిభ చూపి అత్యధికంగా ప్లేస్‌మెంట్లు సాధించినట్లు డైరెక్టర్ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో 80 శాతం మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందారని, మొత్తం 661 మంది విద్యార్థుల్లో 540 మంది ప్రతిష్టాత్మక సంస్థల్లో నియామకాలు పొందినట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరం విద్యార్థులకు లభించిన గరిష్ట వేతనం రూ.27 లక్షలు కాగా, సగటు వేతనం రూ.6 లక్షలుగా నమోదైంది. కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, మెటలర్జికల్ – మెటీరియల్స్ ఇంజినీరింగ్ (ఎం.ఎం.ఈ), మెకానికల్ విభాగాల విద్యార్థులకు వంద శాతం ప్లేస్‌మెంట్లు లభించాయి. పలు ప్రముఖ సంస్థలు క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా చేపట్టిన ఈ నియామకాల్లో విద్యార్థులు విశేష ప్రతిభ కనబర్చి ఉద్యోగాలు సాధించడం గర్వకారణమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను డైరెక్టర్‌తో పాటు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, పరిపాలనాధికారి బి. లక్ష్మణరావు, డీన్ అకడమిక్స్ సాదు చిరంజీవి, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ రుద్రం చింతయ్య నాయుడు, ఈ.ఐ.టి.పి డీన్ శ్యామ్, వివిధ విభాగాల శాఖాధిపతులు, అధ్యాపకులు అభినందించారు.


