రైతుల పాలిట పగాకు | - | Sakshi
Sakshi News home page

రైతుల పాలిట పగాకు

May 2 2026 7:44 AM | Updated on May 2 2026 7:44 AM

న్యూస్‌రీల్‌

పొగాకు కొనుగోళ్లు

రైతుల పరిస్థితి అధ్వానం

గిట్టుబాటు ధర లేదు

శనివారం శ్రీ 2 శ్రీ మే శ్రీ 2026

సాక్షి ప్రతినిధి, ఏలూరు: పొగాకు ధరలు రైతు కంట కన్నీరు తెప్పిస్తున్నాయి. గత రెండేళ్లలో ధరలు కొంత మేరకు ఆశాజనకంగా ఉండటంతో రూ.లక్షల్లో అప్పులు తెచ్చి మరీ సాగు చేసిన రైతులు భారీగా నష్టాలు చవిచూస్తున్నారు. దేశంలోనే అత్యంత నాణ్యమైన పొగాకు దిగుబడి అయ్యే జిల్లాలో ఉమ్మడి పశ్చిమగోదావరి ఒకటి. పంట నాణ్యత గతం కంటే మెరుగైనా, ధరలు మాత్రం గణనీయంగా పతనమవుతున్నాయి. సీజన్‌ ప్రారంభంలో సరాసరి కిలోకు రూ.35లు ధర తగ్గించి కొనుగోలు మొదలుపెట్టగా.. నెలరోజుల వ్యవధిలో మరింత తగ్గించడంతో పొగాకు రైతుల గోడు అరణ్య రోదనగా మారింది.

29 వేల హెక్టార్లకు పైగా..

ఉమ్మడి పశ్చిమలోని దక్షిణాది తేలిక నేలలు (ఎన్‌ఎల్‌ఎస్‌)లో ఈ ఏడాది 29,074 హెక్టార్లల్లో పొగాకు సాగు జరిగింది. 80 మిలియన్‌ కేజీల దిగుబడి అంచనా వేశారు. ఉమ్మడి పశ్చిమలో జంగారెడ్డిగూడెం–1, 2, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి వేలం కేంద్రాల పరిధిలో 12,021 మంది రైతులు 13,864 బ్యారన్లను రిజిస్టర్‌ చేశారు. బ్యారన్ల పరి ధిలో 22194 హెక్టార్లల్లో సాగు విస్తీర్ణంలో 48.75 మిలియన్‌ కేజీలు దిగుబడి అంచనా ఖరారు చేసి ఆ మేరకు పొగాకు బోర్డు అనుమతించింది. అయితే గత రెండేళ్లు సరాసరి కిలో రూ.300 ధర పలకడం కొంతమేరకు గిట్టుబాటుగా ఉండటంతో అనధికారిక సాగు విస్తీర్ణం 7 వేల హెక్టార్ల మేర పెరిగింది. అలాగే దిగుబడి కూడా భారీగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో నాణ్యమైన పొగాకు దిగుమతయ్యే బ్రెబిల్‌, జింబ్వాబేతో ఎన్‌ఎల్‌ఎస్‌ పరిధిలోని పొగాకు పోటీ పడుతుంది. ఈ క్రమంలో కర్ణాటకతో పాటు ఆంధ్రాలోనూ ఎన్‌ఎల్‌ఎస్‌ పరిధిలో ఈ ఏడాది మార్చి 25 నుంచి కొనుగోళ్లు ప్రా రంభించారు. 2024 నుంచి సగటున కిలోకు రూ.270 నుంచి 450 అత్యధిక ధర వరకు పొగాకు కొనుగోళ్లు జరగ్గా సరాసరి రూ.290 నుంచి 300 పలికింది. ఈ క్రమంలో కర్ణాటకలో రూ.300 నుంచి రూ.320 కొనుగోలు చేస్తున్న వ్యాపారులే స్థానికంగా మాత్రం రూ.240 నుంచి రూ.262 ధర మధ్య కొంటున్నారు. సగటు ధర రూ.261.88 దక్కుతుండటంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు.

నాణ్యత బాగున్నా.. ధర లేదన్నా..

దేశీయ వర్జీనియా టుబాకోలో ఎన్‌ఎల్‌ఎస్‌ పరిధిలో పంటకు మంచి డిమాండ్‌ ఉంటుంది. సిగరెట్‌ తయారీలో దీనిని ఎక్కువగా వినియోగిస్తుంటారు. తేమ వాతావరణంలో పండే పంట కావడంతో నాణ్యత బాగుంటుందనే కారణంతో అంతర్జాతీయంగా డిమాండ్‌ ఉంటుంది. గతేడాది కిలో రూ.300లతో ముగిసిన సీజన్‌ ఈ ఏడాది రూ.265 ధరతో ప్రారంభించారు. సీజన్‌ ప్రారంభమైన నెల రోజుల వ్యవధిలో 5 వేలం కేంద్రాల పరిధిలో 8,02,746.70 కిలోల పొగాకును సరాసరి రూ.261.88 ధరకు కంపెనీలు కొనుగోలు చేశాయి. కంపెనీలే సిండికేటుగా మారి ధరను నిర్ణయించడంతో పొగాకు బోర్డు సైతం చేతులేత్తిసిన పరిస్థితి. సీజన్‌ ప్రారంభంలో రూ.265 ధరను రైతులు వ్యతిరేకించి జంగారెడ్డిగూడెం–1, కొయ్యలగూడెం వేలం కేంద్రాల్లో ఆందోళన చేశారు. అయినా మరో రూ.3 ధర తగ్గిపోయింది. కేవలం పది మందికి మించి వ్యాపారులు రాకుండా కొనుగోళ్లు చేయడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కనీసం మద్దతు ధర లేకపోవడం, పొగాకు బోర్డు పట్టించుకోకపోవడంతో ధర మరింత పతనమవుతుందన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సీజన్‌ పరిధిలో రూ.350 ధర వస్తే కనీసం సీజన్‌ మధ్యలో రూ.280 నుంచి రూ.300 మేరకు ధరకు కొనుగోలు చేస్తే రైతుకు కొంత గిట్టుబాటు అయ్యేది. ఎలాంటి అంతర్జాతీయ పరిణామాలు లేనప్పటికీ ధరలు తగ్గించడం గమనార్హం.

ఎన్‌ఎల్‌ఎస్‌ పరిధిలో..

ఏప్రిల్‌ 30 వరకు ఎన్‌ఎల్‌ఎస్‌ పరిధిలో కొనుగోళ్లు జరిగాయి. మొత్తంగా 8,02,746.70 కిలోల పొగాకును సరాసరి రూ.261 ధరకు కొనుగోలు చేశారు.

కేంద్రం కిలోలు

జంగారెడ్డిగూడెం–1 2,40,967.10

జంగారెడ్డిగూడెం–2 1,60,653.20

కొయ్యలగూడెం 1,10,568.60

దేవరపల్లి 1,38,094.70

గోపాలపురం 1,52,463.10

బెంబేలు

పతనం అంచున పొగాకు ధరలు

గతేడాదితో పోలిస్తే ధరలు తిరోగమనం

రూ.261 సగటు ధరతో కొనుగోలు

తొలిరోజు నుంచే రైతుల నిరసన

జిల్లాలో 8.02 లక్షల కిలోల కొనుగోళ్లు

ప్రస్తుతం పొగాకు రైతు పరిస్థితి అధ్వానంగా ఉంది. ఎన్నో ఆశలతో పంటలు వేశాం. కనీసం గిట్టుబాటు ధర కల్పించే పరిస్థితి కనిపించడం లేదు. కిలో రూ.230 నుంచి రూ.260 వరకు కొంటున్నారు. గిట్టుబాటు ధర రూ.300 ఇస్తేనే రైతుకు మనుగడ. లేదంటే ఆర్థ్ధిక ఇబ్బందులు తప్పవు. ప్రభుత్వం, బోర్డు అధికారులు కల్పించుకుని గిట్టుబాటు ధర కల్పించేలా కృషి చేయాలి. – సయ్యద్‌ బాజీ, పొగాకు రైతు, అచ్చియ్యపాలెం

పొగాకు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. కౌలు, పెట్టుబడులు పెరిగినా పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదు. వేలం కొనుగోలు ప్రారంభమై నెల రోజులు దాటినా ఇప్పటివరకు ఆశించిన మేర ధర కల్పించకపోవడంతో ఇళ్ల వద్దనే బేళ్లు ఉంచుకుంటున్నాం. ప్రభుత్వం పట్టించుకోకపోతే రైతులు అప్పులపాలు కావడం ఖాయం.

– కలగర నాని, పొగాకు రైతు, కొమ్ముగూడెం

Advertisement
 
Advertisement
Advertisement