పోషక విలువలు తగ్గవు
● వరి గడ్డికి యమ డిమాండ్
● యంత్రాలతో మాసూళ్లు
● గడ్డిని ఒబ్బిడి చేసుకుంటున్న రైతులు
భీమవరం: జిల్లాలో ఆక్వారంగం విస్తరించడంతో వరి పండించే భూమి విస్తీర్ణం క్రమంగా తగ్గుతోంది. దీంతో పశువులను పెంచే రైతులకు వరి ఎండుగడ్డి కొరత తీవ్ర ఇబ్బంది పెడుతోంది. ఇదే తరుణంలో వరి మాసూళ్లకు కోత యంత్రాలను విని యోగించడంతో గడ్డి కొరత మరింత పెరుగుతోంది. జిల్లాలో సుమారు 2.35 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తుండగా దాళ్వా సీజన్‌లో రైతులు దా దాపు కోతలకు యంత్రాలను వినియోగిస్తున్నారు. దీని వల్ల గడ్డి ముక్కలు మారి పశువుల దాణాకు కూడా పనిచేయడం లేదని చాలా మంది చేలోనే గడ్డిని తగలబెడుతున్నారు. దీంతో గడ్డి కొరత మరింత పెరుగుతోంది. ఈ గడ్డిని దాణాగా ఉపయోగించినా బలం ఉండదని కొంత రైతులు చేలలోని గడ్డిని అక్కడికక్కడే తగలబెడుతున్నారు. దీంతో కొరత మరింత ఎక్కువై పొరుగు జిల్లాల నుంచి గడ్డిని కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం డిమాండ్ బాగుండటంతో ఎకరా గడ్డి సుమారు రూ.8 వేలు పలుకుతోంది.
సుమారు 2.5 లక్షల పశువులు
జిల్లాలోని 20 మండలాల్లో సుమారు 2.5 లక్షల పశువులున్నట్లు అంచనా. వాటిలో 45 వేలు ఆవుజాతి పశువులు, 1.80 లక్షల గేద జాతి పశువులు ఉన్నాయి. కొందరు రైతులు ఇతర జిల్లాలకు వెళ్లి గడ్డి తీసుకురాలేక యంత్రాల ద్వారా మాసూళ్లు చేసిన గడ్డిని పశువులకు దాణాగా ఉపయోగిస్తున్నారు. మాసూళ్లు అనంతరం గడ్డిని చేలల్లోనే నాలుగైదు రోజులు ఎండబెట్టి ప్రత్యేక యంత్రాలతో కట్టలు కట్టించి వాములుగా వేసి పశువుల దాణాకు ఉపయోగిస్తున్నారు. యంత్రాలతో కోసిన గడ్డి ముక్కలుగా మారడంతో పాటు గడ్డిలోని సారం పోతుందని, అందువల్ల గడ్డి ఉపయోగపడదనే అపోహలతో కొందరు రైతులు ఉన్నారు.
కట్టకు రూ.30 ఖర్చు
యంత్రాల ద్వారా మాసూళ్లు చేసిన చేలల్లో కూలీలతో గడ్డి వాములు వేయించడానికి ఎక్కువ ఖర్చవుతుండటంతో రైతులు గడ్డి కట్టలు కట్టడానికి యంత్రాలను ఉపయోగిస్తున్నారు. ప్రత్యేక యంత్రం ద్వారా కట్టలు కట్టించి ట్రాక్టర్స్‌తో గట్టుకు చేర్చి గడ్డివాములుగా వేస్తున్నారు. యంత్రం ద్వారా ఒక్కో కట్టకు రూ.30 ఖర్చవుతోంది. ఈ లెక్కన ఎకరా గడ్డిని ఒబ్బిడి చేయడానికి సుమారు రూ.2 వేలు ఖర్చవుతుందని రైతులు అంటున్నారు.
యంత్రాల ద్వారా మాసూళ్లు చేసిన వరి గడ్డిలో ఏమాత్రం పోషక విలువలు తగ్గవు. గడ్డి పొడవుగా కాకుండా చిన్న ముక్కలుగా ఉండటం వల్ల పశువులు సులభంగా తింటాయి. ఈ గడ్డిని పశువులకు వేయడంలో ఎలాంటి సంకోచాలు వద్దు.
–పి.సుధీర్‌బాబు,
అసిస్టెంట్ డైరెక్డర్ పశుసంవర్ధకశాఖ, భీమవరం


